స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Sunday, March 30, 2025

SARVARI !

శార్వరి!

   ఓ 5 సంవత్సరాల క్రితం …ఆ పేరు ఎవరికీ తెలియదు, కొంతమందికి తప్ప. శార్వరీ నామ సంవత్సర పున్నెమా అని ఆ పేరు వెలుగులోకి వచ్చింది. మా మాతాపితరుల నలుగురి సంతానం లో చివరి కళత్రం తను . చివరిదైనందున గారాబంగా పెరగడం అటుంచి..అన్ని కష్టాలను అనుభవించి, ఆటుపోట్లను చవిచూచి , ఎదుర్కొని నిలిచిన ధీశాలి.


ఇంజనీర్లగా తన సంతానాన్ని చూసుకోవాలన్న మా నాన్నగారి తీవ్ర అకాంక్షలకు ( కాటన్ మహాశయుడిని ..దుమ్ముగూడెం ఆనకట్ట నిర్మాణం సమయంలో కళ్ళారా చూస్తూ ప్రభావితమై పెరిగి ..పరిస్థితుల వల్ల ఇంజనీరు కాలేకపోయినాయన)…ఏకైక ప్రతినిధిగా నిలిచిన బుద్ధిశాలి..తనే!ఎందుకంటే మేమందరం బై.పీ.సీ తీసుకొని ఆయన ఆశలపై నీళ్లు చల్లిన వాళ్లమే!



     అలా నాన్నగారి ఒత్తిడి ఒకవైపు..కొన్ని కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్రమైన క్రమశిక్షణలో పెంచిన అమ్మ ప్రేమ కాఠిన్యం ఓవైపు …తనను దావానలంగా తాకినా …శిల్పిలా తనను తాను చెక్కుకుని జీవితంలో స్థిరపడిన మూర్తి మత్వం తనది.


 

    చదువుకునే రోజుల్లోనే అమ్మానాన్నలు స్థిరపరిచిన మనువును ఖాయం మాత్రమే చేసుకుని, ఇరువురి ఇంజనీరింగ్ చదువులు పూర్తిచేసుకున్న తర్వాతనే సహృదయుడైన గొంది. వెంకటరాములు /వెంకటరమణ గారిని మనువాడిన ఓ సగటు మధ్యతరగతి మహిళామూర్తి తను!




    తను పెరిగిన వాతావరణం ప్రభావం తన ఇద్దరాడపిల్లలపై పడకుండా, కటువుగా వుందేమో అని పైకి అనిపించేలా మాత్రమే కనిపించి ..క్రమశిక్షణతో వారిని ప్రయోజకుల్ని చేసిన సప్రేమ మాతృమూర్తి తను !





 యువతిగా,ఆడపడుచుగా,భార్యగా,తల్లిగా , ఓ వియ్యపురాలిగా వివిధ దశల్లో, ఆ దశలకు అణుగుణంగా సమర్థవంతంగా మెలుగుతూ…తను ఇవన్నీ సాధించింది..ఓ ఉద్యోగిని గా ..అదీ నిరంతరం వివిధ ప్రదేశాలలో తిరుగుతూ నిర్వర్తించాల్సి వచ్చిన క్లిష్టమైన బాధ్యతలుండే ఉద్యోగినిగా!



ఇన్ని కష్టాల , ఇన్ని శ్రమలకోర్చిన ఫలితమే నేడు తను కేంద్ర రంగ సంస్థ అయిన E.C.I.L కు General Manager అయ్యింది. అదీ తన పుట్టినరోజు నాడున…అదీ ఉగాది పండగ రోజున.

 
Yes ….She is my sister SARVARI. The General Manager of E.C.I.L. 

       

I am proud brother of Her. I wish …Many many happy returns of this summative day of Promotion, Festival and Bithday.


  Happy birthday to you …Sari!😊💖🙌💦🎊👍🎉!

Thursday, June 27, 2013

వర్ష సమాగమం !


                                                               వర్ష సమాగమం !

కంపిత అణువులన్ని తనువంతట వ్యాపించు రీతి                                                                                           ధర చుంబిత బిందువులన్ని .... ప్రాణ నాధ ప్రాపుని   కోరి
అతిశయమున తన రూపునె విడివడి ... వడివడిన ఆతని వొడిని చేరి 
పరవశమున రేగడి ఉరవడిన ...సరాగమాడె యెదసడి హెఛ్ఛన్ !





                                                                                                                                  










 

నిశిరాతిరి !

నిశిరాతిరి కి తెలియదా ?????




అలసిన కన్నులకే ...అంతుచిక్కని అలజడి యెక్కువని 

పరుగెత్తే మనసుదే ..సడిని మించిన ఉరవడి అని 

గమ్యం తెలియని గమనానికే ....గతుకుల బాటైనా తొందరేనని 

నిశ్శబ్ధ నీరవ రోదనకే ...ఓదార్పు హస్తం లేదని 

యెద సడి చేసే ఘోషే ..బధిర శంఖారావమని

ఒంటరి బతుకున ఆశే...నింగికి పరచిన నిచ్హెనని 

తోడుకై పడిన తపనే... ఎడారి మృగతృష్ణకు ప్రతిరూపమని

ప్రతికూలపు కాలపు బాటే ...నేనాడే జీవిత ఆటని 

తెలిసీ వగచే వగపే ... జీవిత సత్య నిదర్శనమని 

జీవన యాన పరమార్ధమని ...పరి పూరితమని !



మూల భావాన్ని పంచుకున్న అజిత్ కొల్లా గార్కి ..శతకోటి ధన్యవాదములతో 

Thursday, April 11, 2013

సంకటహర వెంకటేశ్వరస్వామి చరిత్ర

                                  ఓం నమో వెంకటేశాయ !





 భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా( అప్పటి ఖమ్మం ), దుమ్మగూడెం మండలం ,బైరాగుల పాడు గ్రామములో వేంచేసియున్న శ్రీ సంకట హర వేంకటేశ్వర స్వామి వారి చరిత్ర !


                              *********************** 
సప్తప్రభోధములు                                                                                 
  1. సాధన 
  2. విద్యావిస్తరణ 
  3. అందరి కీ  ఆరోగ్యం 
  4. స్వయంపోషకత్వం
  5. పర్యావరణ సంతులనం 
  6. మహిళా జాగృతి 
  7. దురాచార దుర్వ్యసనాల నిర్మూలన 
                        ఈ విప్లవాత్మక ప్రభోధముల ఆచరణ  వలన మానవ వ్యక్తిత్వ నిర్మాణం,  భావపూర్వక మైన మార్పు అనేవి వాటంతట అవే  సంభవిస్తాయి . కానీ ఒక్క మానవ సంకల్పం ఉంటె సరిపోదు . అత్యాధ్మిక చింతన మరియు సాధన ద్వారానే అవి సాధ్యము కాబట్టి , కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బైరాగులపాడు గ్రామములో '' శ్రీ సంకట హర వెంకటేశ్వర స్వామి '' వేంచేసి కామితార్ధ వరప్రసాదునిగా  ఈ దండకారణ్యము లో  ఆరాధింప బడుతున్నాడు !




ఆ చరిత్ర విధంబెట్టిదనిన .............. 
                                                       త్రేతాయుగములో శ్రీ మహా విష్ణువు ,దుష్ట శిక్షణ -శిష్ట రక్షణ కొరకు మానవావతారము దాల్చి , భూలోకములో శ్రీ రామచంద్రునిగా అవతరించి 14 ఏండ్లు అరణ్యవాసము చేసినట్లు రామాయణము తెలియచేస్తున్నది . రాములవారు తిరుగాడిన అరణ్యమే........''దండకారణ్యము'' !భద్రుని  తపస్సు ఫలితమే .... నేటి ' భద్రాచలము ' ! సీతారామ లక్ష్మణులచే నిర్మింపబడిన అప్పటి కుటీర ఆవాస ప్రాంతమే నేటి '' పర్ణశాల '' ! భద్రాచలానికి  పర్ణశాల కు మధ్యనున్న గ్రామమే '' బైరాగులపాడు ''! ఆ గ్రామములో అప్పటిలో పెద్ద-పెద్ద మర్రి వట వృక్షములు వుండెడివట ! బైరాగులైన రామభక్తులు భద్రాచలము నుండి పర్ణశాలకు -పర్ణశాల నుండి భద్రాచలమునకు రామనామ సంకీర్తనలో పాదచారులై వస్తూ పోతూ ఆ మర్రి వట వృక్షముల చల్లని  నీడలో సేద తీరెడివారట  ! అందుకే ఆ గ్రామమునకు    ' బైరాగులపాడు' అని సార్ధక నామము వచ్చినదని పెద్దలు చెపుతారు. ఆ గ్రామస్తుల ప్రభావమో , ఆ గ్రామా ప్రజల మరియు పరిసర ప్రాంతాల గిరిజనుల అదృష్టమో లేక  దండ కారణ్య మందలి యావన్మంది భక్తుల పుణ్య ఫలమో .... ఈ కలియుగములో బైరాగులపాడు గ్రామములో '' శ్రీ సంకట హర వేంకటేశుని ''  గా వేంచేసి కామితార్ధవరప్రసాదునిగా ఆరాధింప బడుతున్నాడు !

కురసం కన్నయ్య మరియు శ్రీ లక్ష్మి దంపతులు 

   ఆ ఊరిలోని ... విద్యావంతులు , భక్తిపరులైన  ఓ గిరిజన దంపతుల ( కోయదంపతుల )  మనస్సులో బీజము గా అంకురించిన ఓ కోరిక , ఆ గ్రామ పెద్దల సంపూర్ణ అంగీకారముతో , సహకారముతో మరియు  సంలక్ప  బలముతో మొక్కగా మారి నేటి మానుగా మీ ముందు అవతరించింది.వారిద్దరు '' ముఖ్య కార్యకర్తలు'' గా  ముందుకు వచ్చి గ్రామ పెద్దలతో '' ఆలయ నిర్మాణ  కమిటీ '' ఏర్పరచి ఆలయ నిర్మాణానికి ప్రతినపూనారు !వారందరి మదిలో ఒకటే ఆలోచన !
  • విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భద్రాచలములో 'కల్యాణరాముడు  గా 
  • పర్ణశాల లో  శోకరాముడి'గా 
  • దుమ్మగూడెం లో' అత్మారాముడి' గా .... ఆరాధింప బడుతున్నాడు . 
  • కనుక బైరాగులపాడు లో సంకట హరుడుగా విలసిల్లాలని సంకల్పించారు !
      అలా ఆ గిరిజన దంపతుల ఉడుత సాయపు స్థల -ధన దానము తో మొదలయిన యజ్ఞం దండకారణ్యమందలి భక్తులు, ఖమ్మం జిల్లాలోని అనేకమంది భక్తుల సహకారముతో, రెండు సంవత్సరముల ఆలయ కమిటీ సభ్యుల అవిరళ కృషి తో 2001 ఏప్రిల్ 26 నాడు పీటము తో కలిపి ఆరు అడుగులు వున్న స్వామి వారి ' విగ్రహ ప్రతిష్ట -ద్వజస్థంభ ప్రతిష్ట ' జరిపి.......  శాస్త్రోక్తం గా  ' శాంతి కల్యాణం ' చేయడం జరిగింది !

   *****************         ******************          ************************


           నాటినుంచి నేటివరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా , ధూప-దీప నైవేద్యాలతో స్వామి వారికి భక్తిప్రపత్తులతో సేవలు నిర్వహించాబడుచునే వున్నవి. శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత ' బండిరేవు ' గ్రామములో వెలసి వున్న ' అలివేలు మంగ పద్మావతి ' అమ్మవారి చరిత్ర వెలుగులోకి వచ్చి నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 తరవాత  వచ్చే స్వామి  వారి తిధి '' తదియ '' నాడు అలివేలు మంగమ్మ వారితో కళ్యాణము జరుగుతూంది .స్వామి వారి కల్యాణమునకు  విచ్చేయు వేదపండితులు , తిరుపతికి - మంగాపురానికి ఎటువంటి అవినాభావ సంబంధమున్నదో , బైరాగులపాడు  కు -బండిరేవు కు అటువంటి అవినాభావ సంబంధమే వున్నదని ప్రవచించుటయే గాక ఈ రెండు గ్రామాలలోని ఆలయాలు పుణ్య క్షేత్రాలుగా పేరు గాంచుతాయని దీవించి ప్రతియేటా పూజాదికాలు నిర్వహిస్తూ వారూ పులకిస్తున్నారు , తరిస్తున్నారు . పూర్వం రాజాధిరాజులు ఆలయాలు నిర్మించారు, నిర్వహించారు.  కానీ ఈ కలియుగములో వేదపండితుల దీవెనలు ఫలించాలంటే , యావన్మంది భక్త జనావళి సహాయ సహకారాలు అత్యవసరమ్.స్వామి వారి ఆలయము అనేక గిరిజన గ్రామాల మధ్య ఉన్నందున , ఎటువంటి ఆర్ధిక వనరులు లేకుండుట వలన , ఆలయ నిర్వహణ అతికష్టముగా జరుగుచున్నది.కావున భక్తులందరి సహకారము అత్యవసరముగా నున్నది.
ఉత్సవ విగ్రహాలు 

                        ఖమ్మం జిల్లా కలెక్టరుగారు ఆలయాన్ని సందర్శించడం జరిగింది అప్పుడు వారికి ఆలయ స్ధితి-గతులు గ్రామ పెద్దల సమక్షమున విన్నవించడం జరిగింది .భద్రాచల  రామాలయ దేవస్థానము నిధి నుంచి ఆలయ నిర్వహణ కొరకు ఆర్ధిక సహాయము కోరుతూ జిల్లా కలెక్టరు గారి ద్వారా దరఖాస్తు పంపు కోవలిసినదిగా  తెలిపారు. అలాగే పంపగా దేవాదాయ శాఖ కమీషనరు గారు భద్రాచల రామాలయ నిధి నుండి నెలకు 2000/- రూపాయలు మంజూరు చేసారు.  2003 సెప్టెంబరు నుండి 2005 ఆగష్టు వరకు సదరు ఆర్ధిక సహాయము అందినది .  ఆ తరువాత సదరు సహాయము నిలిపి వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానమునకు దరఖాస్తు పంపుకోవలసినది గా ఆదేశించారు . కాని ఎన్ని దరఖాస్తులు పంపుకొ న్ననూ ఎటువంటి ఆర్ధిక సహాయము మంజూరు అవడము లేదు ! దేవాదాయ శాఖ కమీషనరు గార్కి ధూప, దీప నైవేద్యముల కొరకు ఎన్ని ఆర్జీలు నేటి వరకు అది కార్యరూపము దాల్చ లేదు . ఆలయనిర్వహణ అతికష్ట మగుచున్నది . అర్చకుల జీత-భత్యముల చెల్లింపులకు కూడా ఆర్ధిక వనరులు సరిపోవడము లేదు .  

భక్త  కోటి 


               భద్రాచలం -చర్ల రహదారి పక్కగా వున్నందున , భద్రాచలం దాటిన తర్వాత వెంకటాపురం  లోపు వున్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదే  ఇనందువల్ల  ఈ క్రింది వనరులు చేకూరిన ఆలయం మరింతగా శోభిల్లును !

  • ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు 
  • ప్రహరీ గోడకు వెలుపల , లోపల ఆత్యాధ్మిక  బొమ్మలతో తుది మెరుగులు  మరియు 
  • శ్రీ లక్ష్మీ, మంగతాయారు సహిత స్వామి వారి  బొమ్మలతో రహదారి పక్కగా ఓ 'ఆర్చీ'
నిర్మిస్తే ఆత్యాధ్మిక ప్రేరణ జరుగునని ఓ ఆశ ! పైన వివరించినవన్నీ సమకూరాలంటే భక్తులందరూ తోచిన విధముగా , శక్తి ని బట్టి ఆర్ధిక సహాయము అందించి దండ కారుణ్య మందలి శ్రీ సంకటహర వెంకటేశ్వర స్వామి అలయాభివృద్దికి చేయూత నిస్తారని ఆలయ కమిటి ముకుళిత హస్తాలతో యావన్మంది భక్త శ్రేష్టులను ప్రార్దిస్తున్నది .
            
                                                                                         ఇట్లు

        (దివంగతులైన మాతా -పితరుల  ఆజ్ఞానుబద్ధుడనైన - కుమారుడనగు )
                                                                                              
                                                                 కురసం.వేంకటరమణమూర్తి
                                                                         ఆలయ కమిటీ ధర్మకర్త
                                                                           బైరాగులపాడు గ్రామము 
                                                                         దుమ్మగూడెం  మండలం మరియు పోస్ట్ 
                                                                            భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా !
                                                                                                 
                                               చరవాణి నెంబరు      9849418939
My address :
    Dr.K.V.RAMANA MURTHY. M.D
          ASSOCIATE PROFESSOR
          DEPT. OF FORENSIC MEDICINE
          GANDHI MEDICAL COLLEGE
             SECUNDERABAD.