స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Sunday, March 30, 2025

SARVARI !

శార్వరి!

   ఓ 5 సంవత్సరాల క్రితం …ఆ పేరు ఎవరికీ తెలియదు, కొంతమందికి తప్ప. శార్వరీ నామ సంవత్సర పున్నెమా అని ఆ పేరు వెలుగులోకి వచ్చింది. మా మాతాపితరుల నలుగురి సంతానం లో చివరి కళత్రం తను . చివరిదైనందున గారాబంగా పెరగడం అటుంచి..అన్ని కష్టాలను అనుభవించి, ఆటుపోట్లను చవిచూచి , ఎదుర్కొని నిలిచిన ధీశాలి.


ఇంజనీర్లగా తన సంతానాన్ని చూసుకోవాలన్న మా నాన్నగారి తీవ్ర అకాంక్షలకు ( కాటన్ మహాశయుడిని ..దుమ్ముగూడెం ఆనకట్ట నిర్మాణం సమయంలో కళ్ళారా చూస్తూ ప్రభావితమై పెరిగి ..పరిస్థితుల వల్ల ఇంజనీరు కాలేకపోయినాయన)…ఏకైక ప్రతినిధిగా నిలిచిన బుద్ధిశాలి..తనే!ఎందుకంటే మేమందరం బై.పీ.సీ తీసుకొని ఆయన ఆశలపై నీళ్లు చల్లిన వాళ్లమే!



     అలా నాన్నగారి ఒత్తిడి ఒకవైపు..కొన్ని కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల తీవ్రమైన క్రమశిక్షణలో పెంచిన అమ్మ ప్రేమ కాఠిన్యం ఓవైపు …తనను దావానలంగా తాకినా …శిల్పిలా తనను తాను చెక్కుకుని జీవితంలో స్థిరపడిన మూర్తి మత్వం తనది.


 

    చదువుకునే రోజుల్లోనే అమ్మానాన్నలు స్థిరపరిచిన మనువును ఖాయం మాత్రమే చేసుకుని, ఇరువురి ఇంజనీరింగ్ చదువులు పూర్తిచేసుకున్న తర్వాతనే సహృదయుడైన గొంది. వెంకటరాములు /వెంకటరమణ గారిని మనువాడిన ఓ సగటు మధ్యతరగతి మహిళామూర్తి తను!




    తను పెరిగిన వాతావరణం ప్రభావం తన ఇద్దరాడపిల్లలపై పడకుండా, కటువుగా వుందేమో అని పైకి అనిపించేలా మాత్రమే కనిపించి ..క్రమశిక్షణతో వారిని ప్రయోజకుల్ని చేసిన సప్రేమ మాతృమూర్తి తను !





 యువతిగా,ఆడపడుచుగా,భార్యగా,తల్లిగా , ఓ వియ్యపురాలిగా వివిధ దశల్లో, ఆ దశలకు అణుగుణంగా సమర్థవంతంగా మెలుగుతూ…తను ఇవన్నీ సాధించింది..ఓ ఉద్యోగిని గా ..అదీ నిరంతరం వివిధ ప్రదేశాలలో తిరుగుతూ నిర్వర్తించాల్సి వచ్చిన క్లిష్టమైన బాధ్యతలుండే ఉద్యోగినిగా!



ఇన్ని కష్టాల , ఇన్ని శ్రమలకోర్చిన ఫలితమే నేడు తను కేంద్ర రంగ సంస్థ అయిన E.C.I.L కు General Manager అయ్యింది. అదీ తన పుట్టినరోజు నాడున…అదీ ఉగాది పండగ రోజున.

 
Yes ….She is my sister SARVARI. The General Manager of E.C.I.L. 

       

I am proud brother of Her. I wish …Many many happy returns of this summative day of Promotion, Festival and Bithday.


  Happy birthday to you …Sari!😊💖🙌💦🎊👍🎉!

Thursday, June 27, 2013

వర్ష సమాగమం !


                                                               వర్ష సమాగమం !

కంపిత అణువులన్ని తనువంతట వ్యాపించు రీతి                                                                                           ధర చుంబిత బిందువులన్ని .... ప్రాణ నాధ ప్రాపుని   కోరి
అతిశయమున తన రూపునె విడివడి ... వడివడిన ఆతని వొడిని చేరి 
పరవశమున రేగడి ఉరవడిన ...సరాగమాడె యెదసడి హెఛ్ఛన్ !





                                                                                                                                  










 

నిశిరాతిరి !

నిశిరాతిరి కి తెలియదా ?????




అలసిన కన్నులకే ...అంతుచిక్కని అలజడి యెక్కువని 

పరుగెత్తే మనసుదే ..సడిని మించిన ఉరవడి అని 

గమ్యం తెలియని గమనానికే ....గతుకుల బాటైనా తొందరేనని 

నిశ్శబ్ధ నీరవ రోదనకే ...ఓదార్పు హస్తం లేదని 

యెద సడి చేసే ఘోషే ..బధిర శంఖారావమని

ఒంటరి బతుకున ఆశే...నింగికి పరచిన నిచ్హెనని 

తోడుకై పడిన తపనే... ఎడారి మృగతృష్ణకు ప్రతిరూపమని

ప్రతికూలపు కాలపు బాటే ...నేనాడే జీవిత ఆటని 

తెలిసీ వగచే వగపే ... జీవిత సత్య నిదర్శనమని 

జీవన యాన పరమార్ధమని ...పరి పూరితమని !



మూల భావాన్ని పంచుకున్న అజిత్ కొల్లా గార్కి ..శతకోటి ధన్యవాదములతో 

Thursday, April 11, 2013

సంకటహర వెంకటేశ్వరస్వామి చరిత్ర

                                  ఓం నమో వెంకటేశాయ !





 భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా( అప్పటి ఖమ్మం ), దుమ్మగూడెం మండలం ,బైరాగుల పాడు గ్రామములో వేంచేసియున్న శ్రీ సంకట హర వేంకటేశ్వర స్వామి వారి చరిత్ర !


                              *********************** 
సప్తప్రభోధములు                                                                                 
  1. సాధన 
  2. విద్యావిస్తరణ 
  3. అందరి కీ  ఆరోగ్యం 
  4. స్వయంపోషకత్వం
  5. పర్యావరణ సంతులనం 
  6. మహిళా జాగృతి 
  7. దురాచార దుర్వ్యసనాల నిర్మూలన 
                        ఈ విప్లవాత్మక ప్రభోధముల ఆచరణ  వలన మానవ వ్యక్తిత్వ నిర్మాణం,  భావపూర్వక మైన మార్పు అనేవి వాటంతట అవే  సంభవిస్తాయి . కానీ ఒక్క మానవ సంకల్పం ఉంటె సరిపోదు . అత్యాధ్మిక చింతన మరియు సాధన ద్వారానే అవి సాధ్యము కాబట్టి , కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బైరాగులపాడు గ్రామములో '' శ్రీ సంకట హర వెంకటేశ్వర స్వామి '' వేంచేసి కామితార్ధ వరప్రసాదునిగా  ఈ దండకారణ్యము లో  ఆరాధింప బడుతున్నాడు !




ఆ చరిత్ర విధంబెట్టిదనిన .............. 
                                                       త్రేతాయుగములో శ్రీ మహా విష్ణువు ,దుష్ట శిక్షణ -శిష్ట రక్షణ కొరకు మానవావతారము దాల్చి , భూలోకములో శ్రీ రామచంద్రునిగా అవతరించి 14 ఏండ్లు అరణ్యవాసము చేసినట్లు రామాయణము తెలియచేస్తున్నది . రాములవారు తిరుగాడిన అరణ్యమే........''దండకారణ్యము'' !భద్రుని  తపస్సు ఫలితమే .... నేటి ' భద్రాచలము ' ! సీతారామ లక్ష్మణులచే నిర్మింపబడిన అప్పటి కుటీర ఆవాస ప్రాంతమే నేటి '' పర్ణశాల '' ! భద్రాచలానికి  పర్ణశాల కు మధ్యనున్న గ్రామమే '' బైరాగులపాడు ''! ఆ గ్రామములో అప్పటిలో పెద్ద-పెద్ద మర్రి వట వృక్షములు వుండెడివట ! బైరాగులైన రామభక్తులు భద్రాచలము నుండి పర్ణశాలకు -పర్ణశాల నుండి భద్రాచలమునకు రామనామ సంకీర్తనలో పాదచారులై వస్తూ పోతూ ఆ మర్రి వట వృక్షముల చల్లని  నీడలో సేద తీరెడివారట  ! అందుకే ఆ గ్రామమునకు    ' బైరాగులపాడు' అని సార్ధక నామము వచ్చినదని పెద్దలు చెపుతారు. ఆ గ్రామస్తుల ప్రభావమో , ఆ గ్రామా ప్రజల మరియు పరిసర ప్రాంతాల గిరిజనుల అదృష్టమో లేక  దండ కారణ్య మందలి యావన్మంది భక్తుల పుణ్య ఫలమో .... ఈ కలియుగములో బైరాగులపాడు గ్రామములో '' శ్రీ సంకట హర వేంకటేశుని ''  గా వేంచేసి కామితార్ధవరప్రసాదునిగా ఆరాధింప బడుతున్నాడు !

కురసం కన్నయ్య మరియు శ్రీ లక్ష్మి దంపతులు 

   ఆ ఊరిలోని ... విద్యావంతులు , భక్తిపరులైన  ఓ గిరిజన దంపతుల ( కోయదంపతుల )  మనస్సులో బీజము గా అంకురించిన ఓ కోరిక , ఆ గ్రామ పెద్దల సంపూర్ణ అంగీకారముతో , సహకారముతో మరియు  సంలక్ప  బలముతో మొక్కగా మారి నేటి మానుగా మీ ముందు అవతరించింది.వారిద్దరు '' ముఖ్య కార్యకర్తలు'' గా  ముందుకు వచ్చి గ్రామ పెద్దలతో '' ఆలయ నిర్మాణ  కమిటీ '' ఏర్పరచి ఆలయ నిర్మాణానికి ప్రతినపూనారు !వారందరి మదిలో ఒకటే ఆలోచన !
  • విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భద్రాచలములో 'కల్యాణరాముడు  గా 
  • పర్ణశాల లో  శోకరాముడి'గా 
  • దుమ్మగూడెం లో' అత్మారాముడి' గా .... ఆరాధింప బడుతున్నాడు . 
  • కనుక బైరాగులపాడు లో సంకట హరుడుగా విలసిల్లాలని సంకల్పించారు !
      అలా ఆ గిరిజన దంపతుల ఉడుత సాయపు స్థల -ధన దానము తో మొదలయిన యజ్ఞం దండకారణ్యమందలి భక్తులు, ఖమ్మం జిల్లాలోని అనేకమంది భక్తుల సహకారముతో, రెండు సంవత్సరముల ఆలయ కమిటీ సభ్యుల అవిరళ కృషి తో 2001 ఏప్రిల్ 26 నాడు పీటము తో కలిపి ఆరు అడుగులు వున్న స్వామి వారి ' విగ్రహ ప్రతిష్ట -ద్వజస్థంభ ప్రతిష్ట ' జరిపి.......  శాస్త్రోక్తం గా  ' శాంతి కల్యాణం ' చేయడం జరిగింది !

   *****************         ******************          ************************


           నాటినుంచి నేటివరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా , ధూప-దీప నైవేద్యాలతో స్వామి వారికి భక్తిప్రపత్తులతో సేవలు నిర్వహించాబడుచునే వున్నవి. శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత ' బండిరేవు ' గ్రామములో వెలసి వున్న ' అలివేలు మంగ పద్మావతి ' అమ్మవారి చరిత్ర వెలుగులోకి వచ్చి నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 తరవాత  వచ్చే స్వామి  వారి తిధి '' తదియ '' నాడు అలివేలు మంగమ్మ వారితో కళ్యాణము జరుగుతూంది .స్వామి వారి కల్యాణమునకు  విచ్చేయు వేదపండితులు , తిరుపతికి - మంగాపురానికి ఎటువంటి అవినాభావ సంబంధమున్నదో , బైరాగులపాడు  కు -బండిరేవు కు అటువంటి అవినాభావ సంబంధమే వున్నదని ప్రవచించుటయే గాక ఈ రెండు గ్రామాలలోని ఆలయాలు పుణ్య క్షేత్రాలుగా పేరు గాంచుతాయని దీవించి ప్రతియేటా పూజాదికాలు నిర్వహిస్తూ వారూ పులకిస్తున్నారు , తరిస్తున్నారు . పూర్వం రాజాధిరాజులు ఆలయాలు నిర్మించారు, నిర్వహించారు.  కానీ ఈ కలియుగములో వేదపండితుల దీవెనలు ఫలించాలంటే , యావన్మంది భక్త జనావళి సహాయ సహకారాలు అత్యవసరమ్.స్వామి వారి ఆలయము అనేక గిరిజన గ్రామాల మధ్య ఉన్నందున , ఎటువంటి ఆర్ధిక వనరులు లేకుండుట వలన , ఆలయ నిర్వహణ అతికష్టముగా జరుగుచున్నది.కావున భక్తులందరి సహకారము అత్యవసరముగా నున్నది.
ఉత్సవ విగ్రహాలు 

                        ఖమ్మం జిల్లా కలెక్టరుగారు ఆలయాన్ని సందర్శించడం జరిగింది అప్పుడు వారికి ఆలయ స్ధితి-గతులు గ్రామ పెద్దల సమక్షమున విన్నవించడం జరిగింది .భద్రాచల  రామాలయ దేవస్థానము నిధి నుంచి ఆలయ నిర్వహణ కొరకు ఆర్ధిక సహాయము కోరుతూ జిల్లా కలెక్టరు గారి ద్వారా దరఖాస్తు పంపు కోవలిసినదిగా  తెలిపారు. అలాగే పంపగా దేవాదాయ శాఖ కమీషనరు గారు భద్రాచల రామాలయ నిధి నుండి నెలకు 2000/- రూపాయలు మంజూరు చేసారు.  2003 సెప్టెంబరు నుండి 2005 ఆగష్టు వరకు సదరు ఆర్ధిక సహాయము అందినది .  ఆ తరువాత సదరు సహాయము నిలిపి వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానమునకు దరఖాస్తు పంపుకోవలసినది గా ఆదేశించారు . కాని ఎన్ని దరఖాస్తులు పంపుకొ న్ననూ ఎటువంటి ఆర్ధిక సహాయము మంజూరు అవడము లేదు ! దేవాదాయ శాఖ కమీషనరు గార్కి ధూప, దీప నైవేద్యముల కొరకు ఎన్ని ఆర్జీలు నేటి వరకు అది కార్యరూపము దాల్చ లేదు . ఆలయనిర్వహణ అతికష్ట మగుచున్నది . అర్చకుల జీత-భత్యముల చెల్లింపులకు కూడా ఆర్ధిక వనరులు సరిపోవడము లేదు .  

భక్త  కోటి 


               భద్రాచలం -చర్ల రహదారి పక్కగా వున్నందున , భద్రాచలం దాటిన తర్వాత వెంకటాపురం  లోపు వున్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదే  ఇనందువల్ల  ఈ క్రింది వనరులు చేకూరిన ఆలయం మరింతగా శోభిల్లును !

  • ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు 
  • ప్రహరీ గోడకు వెలుపల , లోపల ఆత్యాధ్మిక  బొమ్మలతో తుది మెరుగులు  మరియు 
  • శ్రీ లక్ష్మీ, మంగతాయారు సహిత స్వామి వారి  బొమ్మలతో రహదారి పక్కగా ఓ 'ఆర్చీ'
నిర్మిస్తే ఆత్యాధ్మిక ప్రేరణ జరుగునని ఓ ఆశ ! పైన వివరించినవన్నీ సమకూరాలంటే భక్తులందరూ తోచిన విధముగా , శక్తి ని బట్టి ఆర్ధిక సహాయము అందించి దండ కారుణ్య మందలి శ్రీ సంకటహర వెంకటేశ్వర స్వామి అలయాభివృద్దికి చేయూత నిస్తారని ఆలయ కమిటి ముకుళిత హస్తాలతో యావన్మంది భక్త శ్రేష్టులను ప్రార్దిస్తున్నది .
            
                                                                                         ఇట్లు

        (దివంగతులైన మాతా -పితరుల  ఆజ్ఞానుబద్ధుడనైన - కుమారుడనగు )
                                                                                              
                                                                 కురసం.వేంకటరమణమూర్తి
                                                                         ఆలయ కమిటీ ధర్మకర్త
                                                                           బైరాగులపాడు గ్రామము 
                                                                         దుమ్మగూడెం  మండలం మరియు పోస్ట్ 
                                                                            భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా !
                                                                                                 
                                               చరవాణి నెంబరు      9849418939
My address :
    Dr.K.V.RAMANA MURTHY. M.D
          ASSOCIATE PROFESSOR
          DEPT. OF FORENSIC MEDICINE
          GANDHI MEDICAL COLLEGE
             SECUNDERABAD.
                

Thursday, August 30, 2012

Andamaina o anubhavam !

అందమైన ఓ అనుభవం !
మధురోహలు నిలువెల్లా కమ్ముకున్న ఆ క్షణాన
మధుకీలలు తనువెల్లా అలుముకున్న ఆ వైనాన్న
కనులు మూద్దామంటే  ...కనురెప్పల మధ్య అడ్డముగా నీవు

 ఎడద తెరుద్దామంటే ...హృదయ  ఫలకములో అద్దములా నీవు!



కునుకు చాటున ... ఉనికి పోవునని భీతిల్లిన ఊహాకృతి
ఉలికి పాటున ...ఎగసి పడినది సంశయపు కెరటాల రీతి
నిదుర పుచ్చి కనులు చూపే  ఆ రూపం....'భౌతికం' 
 మెలకువకే నచ్చిమనో నేత్రం మాత్రమే చూసే  ఆ స్వరూపం....'అలౌకికం' !


మనో గవాక్షపు చక్షువులు వీక్షించగలిగే ఆ ప్రేమద్వైతం
మరో లోకపు దారులు తెరిచే మహిమాన్విత మాధ్యమం
మరే రీతిన సాధ్యము కాని అందమైన అనుభవం
మహీ తలమున అంకురించిన అజరామయ భావ వృక్షం  !

Wednesday, August 29, 2012

Neram naadikaadu..... Face book di !

  నేరం నాదికాదు....ఫేసు బుక్కుది !

                     '' ఆర్డర్ ....ఆర్డర్ ''
    జడ్జి గారి అరుపు తో ఈ లోకం లోకి వచ్చిపడ్డా . మెదడంతా ఇంకా మొద్దు బారే వుంది. కళ్ళు మాత్రం తెరుచుకునే వుండడం  వల్ల  అది కోర్టు హాల్ అని అర్ధమవుతుంది. ఇప్పుడే కాస్త స్పృహ లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా మెదడు లో నుంచి'  ఫేసు బుక్ ' పేజీ logout  అవుతున్నట్టు తెలుస్తుంది.
        '' డాక్టరు గారూ...రిపోర్టు చదవమంటే అలా వెర్రి మొహం వేసుకుని చూస్తారేమిటి ? ఇప్పటికే జారీ చేసిన బైలబుల్ వారెంటు ను వెనక్కు తీసుకున్నాను. మేమో జారి చేయమంటారా ?''....అంటూ తీక్షణ స్వరం తో హెచ్చరిస్తున్న జడ్జీ గారి మాటలకు ఖచ్చితముగా అది కోర్ట్ హాలె అని నిర్ధారణ అయ్యింది.
          '' యువరానర్ ... ఈ మధ్య మూడు రోజుల పాటు గుంటూరు వెళ్ళాను examiner  గా . మరో రెండు రోజుల పాటు భాగ్యనగరములోనే మా కాలెజీ లోనే పరీక్షలు నిర్వహించాను . అంటే దాదాపు ఓ వారం రోజులు ఫేసు-బుక్ మొహమే చూడలేదు ,ఏ పోస్టు చదవ లేదు,  ఎవ్వరికీ like లు కొట్టలేదు , ఏ కామెంటు పెట్ట లేదు ! అప్పుడే ...అప్పుడే ఏదో జరిగింది సార్ ! శరీరము మనసు అచేతనంగా మారిన మార్పు అప్పుడే జరిగింది సార్ ! అవును ఖచ్చితం గా అంతే  సార్ .... నాలో ఈ మార్పుకు క్రింది వాళ్ళే కారణం సార్ !''.... అంటూ మళ్లి ఎక్కడికో వెళ్ళిపోయాను .... ఫేస్ బుక్ పేజీలు , రూపాలు కళ్ళ ముందు కదలాడుతుండగా ! 
suman sayani :

     సుం సుం వారి సుసంపన్న మైన భావ-సమ దృశ్య సుప్రభాతాల వాయనాలతో శాయని కమనీయ మేలుకొలుపు విననిదే (అదేనండి కననిదే ) తెల్లారినట్టు అనిపించదు ఆ రోజు !సుమన వమన సుభాషితాలతో కాని కల్లోలిత మానస సంద్రం .. ఎగసి విరిగిపడిన కెరటం తీరం చేరి సేదతీరిన చందాన చల్లబడి ప్రశాంతత ను సమకూర్చుకుంటుంది !
Yaaganti venkateswarlu :
 
     ధైర్యము విలోలమయ్యి ఇంతులపై ' యాగీ ' చేయలేక ..ఇంటావిడ (wife ) పై ప్రతి రోజు జోకులేస్తూ , వృత్తిని 'యాగం' లా - ప్రవృత్తిని పరదాలే లేని సరదాలకు 'భాగం' లా నిభాయిస్తూ , మిత్రగణముకు మూల విరాట్టు మా 'అడవి రాముడు' కితకిత లతో పూర్తవుతుంది  నా 'బ్రేకుఫాస్టు ' !( చెప్పొద్దూ...ఇలాంటి వారికే ' భార్యామణి ' అంటే మితిమీరిన ప్రేమాభిమానం. bee -bee అని బయటికే లోపల మాత్రం honey bee   ).
Maram Dilip kumar :

         మారని లోకపు రీతుల చీల్చి చండాడుతూ ,సమాజపు  చీకటి అరలను చెరగుతూ , మానవీయ బంధాలకు అత్యుత్తమ భాష్యం చెపుతూ, ఆర్ధిక వ్యాపార రీతులలో తనదైన ముద్ర వేస్తూ హార్దిక కోణాన్ని జోడిస్తూ ...' అలై పొంగెరా  ' అంటూ సంగీత -సాహిత్య విషయాలలో తన హృదయపు లోతులను మన ముందు ఆవిష్కరింప చేస్తాడు తన నిశిత వ్యాఖ్యలతో ...'' తను ఎవరినీ ఏమార్చనని... తన మనసును చూడమని '' మారాముగా చెప్పే' మారం దిలీపుడు  ' ! తన  బోధనలతో కార్యోన్ముఖుడను అవుతాను నా విధి నిర్వహణలో అంటే అతిశయోక్తి ఎంతమాత్రము కాదు !
Jagadhatri :

        మోదం పంచే ' ప్రేమ ఔన్నత్యాన్ని ' గిలిగింతలు పెట్టేలా ఎంతలా  పులకింతల లో ముంచగలరో ... ఖేదం పెంచే ప్రేమ రాహిత్యపు నిర్లిప్తిత తాలూకు శుష్క అచేతనత్వం వరకు పేరుకు పోయిన అసంతృప్తి పొరలను ... సమూలంగా పెకలించి, అంతేలా కరగించి  '' మేధో భావ ప్రాప్తి ''  కలిగించే  'సమ విషయ వర్తి ...జగధాత్రి'  కవితలు చదివిన తర్వాత గాని మనసు కొత్త శక్తిని పుంజుకుంటుంది.
Rajsekher Allipuram :

       '' ఇందుగలడందు లేడని  సందేహము వలదు...రాజ్ సర్వోపగతుడు .... ఫేసు-బుక్కు పేజీల ఎందెందు వెదికినా like లు కొట్టుచు నుండు '' అనడంలో ఏ మాత్రమూ అతిశయము లేదనడానికి సజీవ తార్కాణం ' అల్లిపురం రాజ శేఖరు ' గారు. ఆయనచే ఏ పోస్టు అయినా పెట్టి ...ఒక్కసారైనా like కొట్టించుకోపోతే , ఆ రోజు పని జరుగదు అనడము  లో ఇసుమంతయు సందేహము లేదు . అంతేనా ...ఆపన్నహస్తం చాచి సమాజసేవా కార్యక్రముములలో హృదయమంతా పరచి , కార్యక్రమనిర్వాహణ దక్షుడిగా (ఈవెంట్ మేనేజర్ ) శక్తి-యుక్తులన్నీ ధారవోసే ఆయనగారి స్ఫూర్తి ఎప్పటికప్పుడు మన వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దుతునే వుంటుంది.
Chandrakanth Arsid :

        మొన్నటి వానాకాలపు ఆరంభములో అనుకుంటా...ఓ వర్షం కురిసిన  పౌర్ణమి రాత్రి ' చంద్రకాంతి' ని  మిస్సాయ్యాము అని బాధపడ్దాము  మేమందరమూ ! చిత్రముగా ...ఆ రాత్రి ఫేసు-బుక్కు లో కవితా వర్షం కురిసి ఎప్పుడూ చూడని ' చంద్రకాంతి ' విరిసి సరికొత్త భావావేశంలో తడిసేలా చేసిన ' చంద్రకాంత్ ఆర్సిద్' ...ఓ ' ఉమర్ ఖయ్యూమ్ ' మాకు. ఆ కవితా మత్తు ఒక్కసారైనా తలకెక్కితే గాని బుర్ర పనిచేయని ఓ వింత స్థితి !
      ఒకరా...ఇద్దరా ..... సన్నబడి సంమ్మోహనముగా తయారవుతా అంటున్న సకలకళా పల్లవన్ ' చైతన్య వడ్డీ ',    'పడితే వీరి వెంటే పడాల ' అనిపించేలా చేసే ' బి.పి . పడాల ' గారు ,   సూదంటు రాయిలా ..సునిశిత వ్యంగ్యాస్త్రాలతో కుళ్ళు రాజకీయాలను ' మంచాల ' పాలు చేసే ' శ్రీనివాసరావు '' గారు ,    'మోహన'  హైకూల టైకూన్ 'రవి' ,    సినీ సాంకేతిక పరిజ్ఞానపు సవ్యసాచి ' ధరణీ కుమార్ ' ,   ప్రధమ రోటరీ సెక్రటరీ గా సమాజ సేవకై ఉదాత్తపు అడుగులు వేస్తున్న ' పరుచూరి సురేఖ' గారు ,    తెలుగు భావనలను ప్రియమార చదివి .. మనసార మురవండి అంటూ ''అచ్చంపేట రాజ్ '' గారు,    చిన్నవాడైనా ' ఉన్నారా  సారూ ' అంటూ యూ .కే  నుంచి మరీ పలకరించి అందరి చిత్రాలకు share లు కొట్టే '' నాగమల్లి ఉప్పాల''........


   ..............................................................................................''ఇలా ...ఇందరి...ఇందరి పలకరింపులు , చదవాల్సిన post లు  వారం రోజులు మిస్సయిన నేను, చదవలేక పోయిన నేను , వారిని పరోక్షముగా తలచుకోలేక పోయిన నేను .. మనసు చెడి , బుర్ర పాడయ్యి , ఈ రిపోర్టు కూడా చదవ లేకపోతున్న ' అచేతనావస్త' లోకి నన్ను పడ  దోసిన ఈ నేరం ఎవరి దంటారు మిలార్డ్ ??? అన్న పానీయాలు కూడా సహింప చేయనీయకుండా నా శరీరాన్ని , మనసును ఎండగట్టిన ఈ పాపం ఎవరిదంటారు మిలార్డ్ ?????
ఈ నేరం నాది కాదు..... ఈ నేరం నాదికాదు ......నాదికాదు !''
   నా లోని ఆవేశానికి ఎప్పుడో పలాయనం చిత్తగించిన కరెంట్ వల్లనేమో ...జడ్జి గారికి చెమటలు పట్టి చుక్కలు...చుక్కలుగా  రాలుతున్నాయి. సినిమా రీలులాగా వివరించానేమో ...ఈ సారి తెల్ల మొహం వేయడం అయన వంతు అయ్యింది. !
                               మళ్లి  కలుస్తా !

Saturday, April 30, 2011

కరుణామూర్తి

   
'గుడ్-ఫ్రైడే ' సందర్భముగా ....నే రాసిన ఓ కవిత .
అంబరమంటిన సంబరాన్ని 
అవధుల్లేని సంతోషాన్ని 
అందరికీ పంచాలని 
         అవనికి వెలుగివ్వాలని
అంకురించింది ఓ బీజం .....(birth of lord)
అర్పణ గా  తన శరీరాన్ని అందించి 
అణువణువున కరుణరసం 
 అనయము  కురిపించి 
ఆకులు రాల్చింది అదే బీజపు వృక్షం ....(crucifixation of lord)
అంతః కరణంలోజ్ఞాన చక్షువులు తెరిపించాలని 
అవని పూతోటన విశ్వశాంతి గుబాళించాలని
అభిలషించిన ...ఆ కరుణమూర్తి...దివ్వెగా తిరిగి 
అవధరించెను..అభిషేకించెను ..ఆశ్రు సంద్రాల గంధాలతో.... (rebirth of lord).




(క్రైస్తవ సొదరీ-సోదరుల అందరికీ  ......ప్రేమతో అంకితం ).


Monday, June 14, 2010

దరహాస దీపం !

దరహాస దీపం ( జుగల్ బందీ )!  డా. కె. వి. రమణమూర్తి .

             నాకో  ఆర్కుట్ మిత్రుడున్నాడు ..... పేరు  ' రవి కాంత్  ' ! ఓ మంచి భావకుడు .  దాదాపు ప్రతి రోజు        ' శుభోదయం '  అంటూ ఇంగ్లీషు లో ఓ గ్రీటింగు పంపుతాడు !దానికి ప్రతిగా  నేను  ఆ  గ్రీటింగు యొక్క దృశ్యాన్ని బట్టి, ......వ్యాఖ్యలను బట్టి ఓ ' కవిత ' లానో......ఓ ' హైకు ' లానో జవాబిస్తుంటాను. 

            అంటే ఇది ఓ రకంగా ' జుగల్ బందీ ' లాంటిది అన్న మాట  ! తను  ఈ రోజు పంపిన ' గ్రీటింగు ' కు జవాబు ఇచ్చిన తర్వాత  ' వీటిని ఇక్కడ ఎందుకు పొందు పరచకూడదూ  '  అనిపించింది . ఆలస్యం అమృతం విషం ' అనుకుంటూ మొదలు పెట్టా !




         చెక్కిట చేతుల చిక్కిన నవ్వు
         మోమున పూచిన హాసపు పువ్వు 
         నిష్కల్మష బాల్యపు తరగని దివ్వు ( దీపం )
         కరిగించద    ..బంధపు అంతరాల దవ్వు  ( దూరం)! 


విజయానికి  చిహ్నం  .......... హరితం 
తొలి  అడుగు ప్రతీకం  .......... హరితం
నయనానికి  హర్షం ............. హరితం 
కవనానికి కావ్యం ............... హరితం          
భువనానికి వస్త్రం ............... హరితం
కలకూజిత గానం ............... హరితం 
హలాయుధుల స్వేద ఫలం .................హరితం 
జీవన వనిన పూచిన సంతస పుష్పం ...హరితం 
సకల జనుల శుభ ప్రదాతం..................హరితం 
నేస్తం..నీ జాడై వుండాలి........................హరితం... సతతం!  
  
మరో చిన్న ' హైకూ  ' తో ముగింపు పాడతాను !

 
 
తల ఎత్తి నడిచావా......... ప్రతి విజయం నీవెంటే 
నైతికత వీడావా....... నీ నీడ కూడా మాయం వెనువెంటే  !

Tuesday, June 1, 2010

మా వూరి అందాలు - గోదారి బంధాలు - 2

మా గుడితో అనుబంధాలు - డా.కె. వి. రమణమూర్తి.   


                  'మావూరి అందాలు - గోదారి బంధాలు 2'  అని పేరు పెట్టినందుకు  క్షమించండి. పార్టు -2  అని సాగదీసి రాసేంత గొప్ప 'పోస్టు' ఏమీ కాదు ఇది . నా ఉద్దేశం ఏమిటంటే........ అది చదివిన తర్వాతే దీన్ని చదవండి అని చెప్పడం అన్నమాట . ఎందుకంటే - మావూరి పేరు శ్రీనివాసపురం ఎలా మారిందో మీకు చెపుతానని మీకు ఇంతకు ముందు 'వాగ్దానం' చేసాను కాబట్టి. ఇలా పేరు పెట్టాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పడం అన్నమాట . 

                   అదుగో - పైన కనబడుతున్నాడే ఆయనే మా 'సంకట హర వెంకటేశ్వర స్వామి'..... అదేనండీ 'శ్రీనివాసుడు'. గర్భగుడి లోని స్వామిని  డైరెక్టుగా కెమెరాలో బంధించకూడదు కాబట్టి ఓ పలుచటి తెరవేసి  మరీ బంధించాము. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మా స్వామి నిలువెత్తు  విగ్రహం చిద్విలాసం చిందిస్తూ బహు సుందరంగా వుంటుంది . ఆ సుందరాంగుడుకి - మొన్నే (16 - 05 - 10 ) పెళ్లి అయ్యిందేమో - సకల అభిషేకాలతో మరింత వన్నె తేలి సమ్మోహనంగా తయారు అయ్యాడు.

                  'అదేమిటీ.....మొన్ననే పెళ్లి అవడం ఏమిటి ? చిత్రం కాక పొతేనూ'  - అని హాస్చ్యర్యపోకండి !'  అంత ఎండల్లో పెళ్లి చేసుకునే ఉబలాటం ఏమిటీ  '.......అని విస్తు పోకండి.  ' మీ దేవుడైనంత  మాత్రాన మీ ఇష్టమేనా? ' అని విసుక్కోకండి.  నాకూ మీలాగే డౌటు వచ్చి అడిగా అయ్యగారిని. '' అయ్యా ! ఇంత ఎండల్లో అయన ఇబ్బంది పడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఆ ఇబ్బందిని ఇబ్బందీ.... అని చెప్పుకోలేనంత ఇబ్బంది ఎందుకొచ్చిందీ ?''. అని అడిగా  కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూనే ! ఆయనగారు మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇలా సమాధాన మిచ్చారు ....'' బాబూ !  ప్రతి సంవత్సరం ' హోళీ ' రోజున స్వామివారి కళ్యాణమవుతుంది . కానీ ఈ ఆలయ విషయంలో ఆ నియమం చెల్లదు . ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన ప్రకారం 'మే' మాసంలోనే కల్యాణం జరగాలి .కాబట్టి ఎండైనా, కొండైనా.- ఆరైనా, నూరు అయినా - నూరు ఆరైనా ఈ కాలం లోనే చేయాలి ''......అని నొక్కి వక్కాణించే సరికి బుద్దిగా తల ఊపి ....స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లలో తలమునకలై, ఆ కళ్యాణమేదో  జరిపించేసాం.- ప్రతి ఏటా జరిపిస్తున్నాం! పండగలకు - పబ్బాలకు కలుసుకోక పోయినా..... తప్పనిసరిగా కల్యాణానికి అందరం కలవాలని నిశ్చయించుకుని ....అలాగే కలుస్తున్నాం!

                               అదేమిటండీ ............? మీరేమైనా 'టైటిలు' తప్పు పెట్టారా ? 'బైరాగుల పాడు' నుంచి మీ వూరి పేరు ''శ్రీనివాసపురం'' గా ఎలా మారిందో చెప్తానని ....అది చెప్పకుండా చదువుతున్నాము కదా , అని మీ దేవుడి పెళ్లి గురించి  చెపుతున్నారు'..అంటున్నారు కదూ! తొందరపడకండి సార్ /సారినులూ ( అదేనండీ 'మేడం' లూ)! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా!
            

      
 పది సంవత్సరాల క్రితం వరకూ మావూరి పేరు ' బైరాగుల పాడే' !

                                                కురసం. కన్నయ్య  మరియు శ్రీ లక్ష్మి దంపతులు.
                                                                                                                                                                                                                                                                                                               మరి ఎందుకొచ్చిందో తెలియదు కానీ మా మాతా - పితరులకు  మా స్వస్థలంలో 'శ్రీనివాసుని' ఆలయం కట్టాలని తలంపు వచ్చింది . వచ్చిందే ఆలస్యం 'ఆర్ధిక .....హార్దిక పరిపుష్టి' లేని ఆ వూర్లో స్థల దానంతో పాటు ..........ఆర్ధిక దానం తో పాటు..... చందాల కోసం ఊరూరా తిరిగి ......ఆలయ నిర్మాణం చేపట్టి దాన్ని 2000 సం // లో పూర్తి చేసారు . అప్పటి నుంచీ ప్రతి ఏట ' మే ' మాసంలో స్వామి వారి కల్యాణం జరిపిస్తున్నారు. అంచలంచలుగా  నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటికి ఓ రూపు వచ్చింది  .....ఆ ఆలయానికి. మేము కూడా మా శాయశక్తులా.. ఇతోధికంగా కృషి చేసి  ఆలయం ఈ స్థాయికి  వచ్చేలా చేసాం.  చిరస్థాయిగా ఆ వూరి పేరు సార్ధకం కావాలని ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు అందరి పై ప్రసరించాలని ఆశించి ఆ వూరి పేరును '' శ్రీనివాస పురం''గా మార్చి గెజిటులో కూడా మారేలా కృషి చేస్తున్నారు ఆ వూరి గ్రామస్తులు.




  మరిన్నికళ్యాణపు  ఫోటోలు  చూసి తరించండి !  ఉత్సవ విగ్రహాలు వీక్షించండి !

                                                                                                                                                                                          



ఇవండీ    మా వూరి విశేషాలు. మా చిన్ని గుడి ప్రత్యేకతలు. ఎప్పుడైనా పర్ణశాలకు వెళ్తే మాత్రం మా బీద ' ఏజెన్సీ - దేవుడు' ని ఆగి  చూడండే!

               గంగోలు గురించి రాయాలంటే ....ఫోటోలు కొన్ని సేకరించాలి ! అవి పూర్తైన తర్వాత పసందైన విశేషాలతో, కనువిందైన బొమ్మలతో. మీ ముందుంటా ....అంత వరకూ టాటా!