స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Monday, June 14, 2010

దరహాస దీపం !

దరహాస దీపం ( జుగల్ బందీ )!  డా. కె. వి. రమణమూర్తి .

             నాకో  ఆర్కుట్ మిత్రుడున్నాడు ..... పేరు  ' రవి కాంత్  ' ! ఓ మంచి భావకుడు .  దాదాపు ప్రతి రోజు        ' శుభోదయం '  అంటూ ఇంగ్లీషు లో ఓ గ్రీటింగు పంపుతాడు !దానికి ప్రతిగా  నేను  ఆ  గ్రీటింగు యొక్క దృశ్యాన్ని బట్టి, ......వ్యాఖ్యలను బట్టి ఓ ' కవిత ' లానో......ఓ ' హైకు ' లానో జవాబిస్తుంటాను. 

            అంటే ఇది ఓ రకంగా ' జుగల్ బందీ ' లాంటిది అన్న మాట  ! తను  ఈ రోజు పంపిన ' గ్రీటింగు ' కు జవాబు ఇచ్చిన తర్వాత  ' వీటిని ఇక్కడ ఎందుకు పొందు పరచకూడదూ  '  అనిపించింది . ఆలస్యం అమృతం విషం ' అనుకుంటూ మొదలు పెట్టా !
         చెక్కిట చేతుల చిక్కిన నవ్వు
         మోమున పూచిన హాసపు పువ్వు 
         నిష్కల్మష బాల్యపు తరగని దివ్వు ( దీపం )
         కరిగించద    ..బంధపు అంతరాల దవ్వు  ( దూరం)! 


విజయానికి  చిహ్నం  .......... హరితం 
తొలి  అడుగు ప్రతీకం  .......... హరితం
నయనానికి  హర్షం ............. హరితం 
కవనానికి కావ్యం ............... హరితం          
భువనానికి వస్త్రం ............... హరితం
కలకూజిత గానం ............... హరితం 
హలాయుధుల స్వేద ఫలం .................హరితం 
జీవన వనిన పూచిన సంతస పుష్పం ...హరితం 
సకల జనుల శుభ ప్రదాతం..................హరితం 
నేస్తం..నీ జాడై వుండాలి........................హరితం... సతతం!  
  
మరో చిన్న ' హైకూ  ' తో ముగింపు పాడతాను !

 
 
తల ఎత్తి నడిచావా......... ప్రతి విజయం నీవెంటే 
నైతికత వీడావా....... నీ నీడ కూడా మాయం వెనువెంటే  !

Tuesday, June 1, 2010

మా వూరి అందాలు - గోదారి బంధాలు - 2

మా గుడితో అనుబంధాలు - డా.కె. వి. రమణమూర్తి.   


                  'మావూరి అందాలు - గోదారి బంధాలు 2'  అని పేరు పెట్టినందుకు  క్షమించండి. పార్టు -2  అని సాగదీసి రాసేంత గొప్ప 'పోస్టు' ఏమీ కాదు ఇది . నా ఉద్దేశం ఏమిటంటే........ అది చదివిన తర్వాతే దీన్ని చదవండి అని చెప్పడం అన్నమాట . ఎందుకంటే - మావూరి పేరు శ్రీనివాసపురం ఎలా మారిందో మీకు చెపుతానని మీకు ఇంతకు ముందు 'వాగ్దానం' చేసాను కాబట్టి. ఇలా పేరు పెట్టాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పడం అన్నమాట . 

                   అదుగో - పైన కనబడుతున్నాడే ఆయనే మా 'సంకట హర వెంకటేశ్వర స్వామి'..... అదేనండీ 'శ్రీనివాసుడు'. గర్భగుడి లోని స్వామిని  డైరెక్టుగా కెమెరాలో బంధించకూడదు కాబట్టి ఓ పలుచటి తెరవేసి  మరీ బంధించాము. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మా స్వామి నిలువెత్తు  విగ్రహం చిద్విలాసం చిందిస్తూ బహు సుందరంగా వుంటుంది . ఆ సుందరాంగుడుకి - మొన్నే (16 - 05 - 10 ) పెళ్లి అయ్యిందేమో - సకల అభిషేకాలతో మరింత వన్నె తేలి సమ్మోహనంగా తయారు అయ్యాడు.

                  'అదేమిటీ.....మొన్ననే పెళ్లి అవడం ఏమిటి ? చిత్రం కాక పొతేనూ'  - అని హాస్చ్యర్యపోకండి !'  అంత ఎండల్లో పెళ్లి చేసుకునే ఉబలాటం ఏమిటీ  '.......అని విస్తు పోకండి.  ' మీ దేవుడైనంత  మాత్రాన మీ ఇష్టమేనా? ' అని విసుక్కోకండి.  నాకూ మీలాగే డౌటు వచ్చి అడిగా అయ్యగారిని. '' అయ్యా ! ఇంత ఎండల్లో అయన ఇబ్బంది పడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఆ ఇబ్బందిని ఇబ్బందీ.... అని చెప్పుకోలేనంత ఇబ్బంది ఎందుకొచ్చిందీ ?''. అని అడిగా  కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూనే ! ఆయనగారు మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇలా సమాధాన మిచ్చారు ....'' బాబూ !  ప్రతి సంవత్సరం ' హోళీ ' రోజున స్వామివారి కళ్యాణమవుతుంది . కానీ ఈ ఆలయ విషయంలో ఆ నియమం చెల్లదు . ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన ప్రకారం 'మే' మాసంలోనే కల్యాణం జరగాలి .కాబట్టి ఎండైనా, కొండైనా.- ఆరైనా, నూరు అయినా - నూరు ఆరైనా ఈ కాలం లోనే చేయాలి ''......అని నొక్కి వక్కాణించే సరికి బుద్దిగా తల ఊపి ....స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లలో తలమునకలై, ఆ కళ్యాణమేదో  జరిపించేసాం.- ప్రతి ఏటా జరిపిస్తున్నాం! పండగలకు - పబ్బాలకు కలుసుకోక పోయినా..... తప్పనిసరిగా కల్యాణానికి అందరం కలవాలని నిశ్చయించుకుని ....అలాగే కలుస్తున్నాం!

                               అదేమిటండీ ............? మీరేమైనా 'టైటిలు' తప్పు పెట్టారా ? 'బైరాగుల పాడు' నుంచి మీ వూరి పేరు ''శ్రీనివాసపురం'' గా ఎలా మారిందో చెప్తానని ....అది చెప్పకుండా చదువుతున్నాము కదా , అని మీ దేవుడి పెళ్లి గురించి  చెపుతున్నారు'..అంటున్నారు కదూ! తొందరపడకండి సార్ /సారినులూ ( అదేనండీ 'మేడం' లూ)! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా!
            

      
 పది సంవత్సరాల క్రితం వరకూ మావూరి పేరు ' బైరాగుల పాడే' !

                                                కురసం. కన్నయ్య  మరియు శ్రీ లక్ష్మి దంపతులు.
                                                                                                                                                                                                                                                                                                               మరి ఎందుకొచ్చిందో తెలియదు కానీ మా మాతా - పితరులకు  మా స్వస్థలంలో 'శ్రీనివాసుని' ఆలయం కట్టాలని తలంపు వచ్చింది . వచ్చిందే ఆలస్యం 'ఆర్ధిక .....హార్దిక పరిపుష్టి' లేని ఆ వూర్లో స్థల దానంతో పాటు ..........ఆర్ధిక దానం తో పాటు..... చందాల కోసం ఊరూరా తిరిగి ......ఆలయ నిర్మాణం చేపట్టి దాన్ని 2000 సం // లో పూర్తి చేసారు . అప్పటి నుంచీ ప్రతి ఏట ' మే ' మాసంలో స్వామి వారి కల్యాణం జరిపిస్తున్నారు. అంచలంచలుగా  నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటికి ఓ రూపు వచ్చింది  .....ఆ ఆలయానికి. మేము కూడా మా శాయశక్తులా.. ఇతోధికంగా కృషి చేసి  ఆలయం ఈ స్థాయికి  వచ్చేలా చేసాం.  చిరస్థాయిగా ఆ వూరి పేరు సార్ధకం కావాలని ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు అందరి పై ప్రసరించాలని ఆశించి ఆ వూరి పేరును '' శ్రీనివాస పురం''గా మార్చి గెజిటులో కూడా మారేలా కృషి చేస్తున్నారు ఆ వూరి గ్రామస్తులు.
  మరిన్నికళ్యాణపు  ఫోటోలు  చూసి తరించండి !  ఉత్సవ విగ్రహాలు వీక్షించండి !

                                                                                                                                                                                          ఇవండీ    మా వూరి విశేషాలు. మా చిన్ని గుడి ప్రత్యేకతలు. ఎప్పుడైనా పర్ణశాలకు వెళ్తే మాత్రం మా బీద ' ఏజెన్సీ - దేవుడు' ని ఆగి  చూడండే!

               గంగోలు గురించి రాయాలంటే ....ఫోటోలు కొన్ని సేకరించాలి ! అవి పూర్తైన తర్వాత పసందైన విశేషాలతో, కనువిందైన బొమ్మలతో. మీ ముందుంటా ....అంత వరకూ టాటా!