స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Tuesday, May 25, 2010

మా వూరి అందాలు .......గోదారి బంధాలు !

గోదారి గట్టుందీ ........ అని  పాడుకునే అవకాశం ఆ వూరికి వుందీ  అంటే - ఖచ్చితం గా ఆ వూరికి విశిష్టత వున్నట్లే  లెఖ్ఖ ! ఆ గోదారి రెండు ఒడ్లను కలుపుతూ .....మధ్య లో ఓ లంకను కలుపుతూ ఓ ' డాము ' కూడా వుందంటే  మరింత విశిష్టత ఉన్నట్టే ! అలాంటి  వూర్లలో మా వూరు ఒకటి . పట్టణాల పేర్లు ఎలాగూ ' ఫేమస్ ' అవుతాయి. ఇలా అయినా మన వూర్లు ' ఫేమస్ ' కావాలనే స్వార్ధం తో ... ఈ పోస్టు రాస్తున్నా ( అలాగని మిమ్మల్ని ఎక్కువగా విసిగించను లెండి).


'భద్రాచలం' గురించి తెలియని వారు వుండరనుకుంటాను. దక్షిణాది పుణ్య  క్షేత్రాలలో......పేరెన్నిక కన్నది, సీతారాములను మన కళ్ళ ముందు నిలిపేదీ........' భద్రాచలం ' మాత్రమే ! అలాంటి భద్రాద్రి కి - పర్ణశాల కు మధ్యలో, భద్రాద్రి నుంచి 25  కి. మీ. దూరంలో పైకి వున్న ఊరే మా వూరు పేరు '' సున్నం బట్టి- బైరాగుల పాడు ''!

పేరు వింత గానూ కొత్తగానూ వుంది కదూ ! సరే......' దుమ్మగూడెం ' పేరు వినే వుంటారనుకుంటా . ఈ మధ్య ' ఎత్తి పోతల ' పధకాలని....' హైడ్రాల్ ప్రాజెక్టు '  అని......బాగానే వార్తలకు ఎక్కుతుంది లెండి . అదుగో ఆ మండలం లో వున్న ఊరన్న మాట . నేను చెప్ప బోయే  ' డాము- లంక ' ఈ రెండు ఊర్లను ఆనుకునే వుంటుంది.
సరే...సరే   దారి తప్పి మావూరి నుండి ఆ వూరు వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదూ ....అదేమీ కాదు లెండి. అసలు మా వూరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ....


                                                             ఇదే హైడ్రాల్ ప్రా జెక్టు 

సున్నం బట్టి :-   సున్నం అనగా మీకు తెలుసు (lime ) మరి బట్టి అంటే తెలుసుగా కొలిమి' లాంటి ఓ పెద్ద పొయ్యి అన్నమాట. సున్నం తయారు చేసే  ప్రక్రియ కు దోహదపడే ఒక సాధనం అనుకుందాం.  'అసలు సున్నం తయారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది '.....అని మీకు సంశయం కలగవచ్చు. మీ డౌటు కరెక్టే !
ఎందుకు తయారు చేయవలసి వచ్చిందంటే అప్పట్లో ఏ కట్టడం కట్టాలన్నా ' రాయి' ' సున్నం ' తోనే కట్టేవారు కాబట్టి . అక్కడ సర్ .ఆర్థర్ కాటను మహాశయుడు ఓ వారధి ( డాము ) నిర్మించాడు కాబట్టి !  మధ్యలో  ఓ చిన్న దీవి  వుంది దాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఒడ్డు ను ఈ ఒడ్డును కలుపుతూ రెండు ఎర్తు డాములు కట్టి ' గోదావరి ' ని అందంగా ....సున్నితం గా బంధించాడు కాటను మహాశయుడు !వర్షా కాలం లో నీరు ఆ డాముల మీదుగా పొంగి పొర్లుతూ ' రాజమండ్రి ' వైపుగా పరుగులు పెడతాయి !

హెడ్డు- లాకులు

హెడ్డు లాకులు:  అప్పట్లో బస్సులు ఎక్కువ లేవు గాబట్టి.. రవాణా సౌకర్యం నీటి పైనే వుండేది . అదీగాక అప్పట్లో ' రాజమండ్రి -పేపరు మిల్లు 'కు కావాల్సిన కలప ' వెదురు తెప్పలు' గా ( పాత 'గోరింటాకు '...సినీమాలో లా ) గోదావరి మీదుగానే ప్రయాణించ వలసివచ్చేది ! అందుకే ఓ ఆరు కిలోమీటర్లు కాలువ ఒకటి తీసి  దానికి డాము పక్కన ఇవతలిగా ' మూడు అంచెల లో ' దాటే విధంగా ' లాకులు ' అమర్చారు. లాంచి  గానీ.....తెప్ప గానీ దాటాలంటే కనీసం మూడు గంటలైనా పట్టేది . అది చూడవలిసిందే కాని వర్ణించనలవి  కానిది . అంటే పై ఎత్తులో వున్న తెప్ప .....మూడు అంచెలుగా క్రిందకు దిగి ....కాలువ లో కలిసి ఆరు కి. మీ. ప్రయాణించి గానీ టైలు  లాకులు చేరుకోవు. 

                          అవతల వొడ్డున కనపడుతున్నది' భారజల అణు విద్యుత్ కేంద్రం ', అశ్వాపురం

టైలు లాకులు : అవునండీ - తోక భాగంలో వుంటాయి కాబట్టి టైలు-లాకులు అన్నారు .ఇవి  ' గంగోలు ' అనే వూర్లో వున్నాయి. గోదావరి వొడ్డున... నాలుగంటే నాలుగు  ఇల్లు . చుట్టూ అన్ని రకాల వృక్షాలు.  ఆరు కి.మీ.  దూరం...ఎడబాటు ను  సహించలేని.. ఆ కాలవ పాయ ఆత్రం గా గోదావరి లో కలిసే వైనం.... చోటు...  ఎప్పటి కీ  మరిచి పోలేను.  నా బాల్యం అంతా  అక్కడే గడిచింది. దీన్ని గురించి  రాయాలంటే ఓ పెద్ద గ్రంధమే అవుతుంది. ఫోటో లతో మళ్లీ  వేరే రాస్తా. ఇక్కడ కూడా మూడు అంచెలుగా మళ్లీ  లాంచి గానీ.... తెప్ప   గానీ.. పడవ గానీ లాకులని దాటి అప్పుడు గోదావరిలో కలుస్తాయి .అదండీ సంగతి.


అరె అసలు సంగతి మర్చిపోయాను ....' బైరాగుల పాడు ' గురించి చెప్పనే లేదు కదూ !..

బైరాగులపాడు :  ' బైరాగులు ' అంటే తెలుసు కదండీ ' సన్యాసులు ' ! చెప్పాను కదండీ మా వూరు ' భద్రాద్రి ' కి  పర్ణశాలకు మధ్యన వుంటుంది కాబట్టి . కాలినడకన భద్రాద్రి నుంచి బయలు దేరిన సన్యాసులు అందరూ మా వూరు మొదట్లో  వున్న చింతల తోపులో ఆగి , బిక్ష చేసుకుని, తత్వాలు పాడుకుని, తిరిగి తెల్లవారే బయలుదేరి  వెళ్ళేవారట ! అలా - వాళ్ళకు  మజిలీ గా పనికి వొచ్చింది కాబట్టి  కాల క్రమం లో '' బైరాగుల పాడు'' గా స్థిర పడిపోయింది . ఇప్పుడది ' శ్రీనివాస పురం ' గా మారింది  లెండి . ఆ  కధా - కమామీషు '' మా వూరి గుడి '' లో రాస్తాను లెండి .

Sunday, May 23, 2010

విమాన దుర్ఘటన - అవశేషాల గుర్తింపు - శాస్త్రీయ పద్ధతిలో !

అత్యంత విషాదం - దయనీయం!


ఓ న్యాయ వైద్య శాస్త్ర నిపుణుడి గా (medico - legalexpert) విగత జీవుల గుర్తింపు ఎంత కష్టమవుతుందో నాకు బాగా తెలుసు. తమ వారి అస్థికలనైనా కడసారి చూసుకోవాలని, చితా భస్మాలని పుణ్య నదాలలో కలిపి,వారి ఆత్మలను ఇహ లోకం నుంచి విముక్తి పరచాలని, ఎంతగా తపిస్తారో, ఓ పెద్ద మనిషిగా నాకూ తెలుసు.

చెల్లాచెదురైన విడివడ్డ దేహపు అంగాలను గుర్తించడం ఒక ఎత్తు ఐతే - అవి ఎవరికి చెందినవో గుర్తించడం మరో ఎత్తు. కష్టసాధ్యమైనదీనూ! అల్లాంటి పరిస్థితులలో చనిపోయిన వారి అవశేషాలను బంధువులకు అప్పగించడమనేది - ప్రభుత్వపు కనీస భాద్యత !


అవశేషాలను ఈ క్రింది విధంగా గుర్తుపట్టొచ్చు!

1): వారి వ్యక్తిగత వస్తువుల ద్వారా. ఉదా: వారు వేసుకున్న బట్టలరంగు, తయారీ, కోలతలు,కుట్టించిన వైతే 'దర్జీ మార్కు', బూట్లు వాటి కొలతలు, పర్సు వాటిలోని వివరాలు.

2): జనన ప్రత్యేకతలు (ఆరు వేళ్ళు వుండడం, పెద్ద పుట్టుమచ్చలు వుండడం).

3): జనన లోపాలు (ఎలాంటి వైనా).

4): ఖచ్చితత్వం కోసం - దేహపు అంగాలలో - కాలకుండా వున్నా ఎటువంటి అంగమైనా (మాంసము..ఎముకలు )'డి .యెన్ . ఏ పరీక్షల నిమిత్తం పంపవచ్చు.( తాగి పారేసిన 'సిగరెట్టు పీక'కు అంటిన లాలాజలం నుండి కూడా పై పరీక్షలు చేయవచ్చు ). 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

ప్రతి శాంపిలు సేకరణకు - వాడిన గ్లౌసులు వాడకూడదు, వాడిన ఫోర్సేప్స్ (సేకరించే శ్రావణం లాంటిది ) తిరిగి వాడకూడదు. అంటే ప్రతి దానికి శాస్త్రీయ పద్ధతులలో శుభ్రపరచబడిన కొత్త గ్లౌసులు, శ్రావనాలు వాడాలి..ప్రతీ సేకరణకు.

5): అంతేకాక దేహంలోని పొడుగైన ఎముకల లభ్యత, నడుము ఎముక మరియు పుర్రె ఎముకల లభ్యతను బట్టి కూడా వారి యొక్క లింగము, వయస్సు మరియు రమారమి ఎత్తు చెప్పవచ్చు . 

ఇవన్నీ కూడా కాలకుండా - భస్మం కాకుండా ఉంటేనే చెప్పవచ్చు. కాస్తా అటూ-ఇటూగా! ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు!

Thursday, May 13, 2010

వసి వాడని పసితనం

    వసి వాడని పసితనం లో ....
             వుంటారు అందంగా ' బుడతలు ' !

  జీవితాన్ని ప్రశ్నిస్తే ......
                మొదలవుతాయి మొహం లో  ' ముడతలు ' !

Wednesday, May 12, 2010

దీపం చుట్టూ శలభం !


డా. కె. వి.రమణ మూర్తి .
మనసు పుటలు తిరగేస్తే..
మరువ రాని వ్యధలెన్నో !
వలపు తలపు తలుపు తట్టి ..
మరలి పోనికథలు ఎన్నో !
కలల పునాదులపై ఆకృతి దాల్చిన...
ఊహా రమ్య సౌధాలెన్నో !
జీవిత సుడి గుండం లో బంధించి ....
అతలా కుతలం చేసే చేదు నిజాలెన్నో! 

కల , కల్పన , మిధ్యా జగత్తు లో...
దీపం చుట్టూ శలభం లా తిరిగే
ఈ మనిషి మారే దెన్నడో..
రేగిన ఆ గాయాలు మానేదెన్నడో.. మానేదెన్నడో !
(తుమ్ములోచ్చేలా, దుమ్ము దులిపి మరీ తిరగేసి, అక్షర రూపం ఇచ్చిన నా పాత కవిత)23-10-1984  నాటిది !


Tuesday, May 11, 2010

సైనికుని భార్య


డా. కె. వి . రమణ మూర్తి

( 'సైనికుని భార్య '... అనే ఓ శీర్షిక మీద 'స్పాట్- పోయెట్రీ ' పోటీ లో పాలు పంచుకున్న ఓ కవిత !)
కలత నిదుర కనుల కొలకుల ...
............ ఎర్ర బారి కరుడు కడితే

ఎడద బరువు వెతల మెదడుకు ..........
........... కాల పాశపు ఉరి బిగిస్తే
ఆశ-నిరాశల వ్యధన మధనం ..........
...........కరకు కార్గిల్ కదన మైతే
ఎదురు చూపుల నిట్టూర్పు సెగలు .......
........
స్ఫుటిత పర్వత లావాలై ఎగ చిమ్మితే

మరిగి మరిగి .....మనసు విరిగి .....
........రోదనలైన వేదనలు నలుచెరగులా ప్రతి ధ్వనిస్తే
అలసి సొలిసి.....కరిగి తరిగి...........
.......... ఆవిరైనశరీరపు ఓ ' శుష్క మూర్తి ' మీ ముందు ప్రతిబింబిస్తే

అది ఎవరో కాదు ...ఆమే......
..........ఆకాశ మంత ఎత్తు ఎదిగిన ఆమే
మన ప్రాణం కోసం తన తాళిని .......
.......... పణంగా పెట్టిన ఆమే


కార్గిల్ కబంధ హస్తాలలో చిక్కిన ......
............ ఓ సైనికుని భార్య !

 
( దేశం కోసం ....అసువులు బాసిన వీర జవాన్లకు .........అశ్రు నివాళులతో ' అంకితం )

Monday, May 10, 2010

రేరాజు వగలు

రేరాజు వగలు ........................ డా . రమణ మూర్తి !నేను కాలేజీ చదువు తున్న రోజుల్లో........మా 'కాలేజి డే' సందర్భంగా 'స్పాట్- పోయెట్రీ ' పోటీ పెట్టారు . పాల్గొనే వాళ్ళు తక్కువ వున్నారు కాబట్టి . 'మనకు కూడా ఓ బహుమతి రాక పోద్దా ?'... అనే దుర్బుద్ధి తో........ఆశ తో 'తగుదునమ్మా' అంటూ నేనూ పాలుగొన్నాను.

వాళ్ళు ' ఓ వెన్నల రాత్రి లో.........చెట్టుకింద 'ప్రేమ జంట ' ....చెట్టుపైన ' పక్షి జంట ' ' వున్నా ఓ ఫోటో పెట్టి ....దానిపై కవిత రాయ మన్నారు . ఇదిగో ................నేను ఇలా రాసా ! ఆ చిత్రం ఇప్పుడు లేదు కానీ దానిని పోలిన బొమ్మలు కొన్ని పెడుతున్నా ! సర్దుకు పొండే !

ప్రకృతి కాంత ఒడిలోపక్షుల జంట

రేరాజు వగలన్ని వెన్నెలై వొలుక మింట


ఊసులాడ మమ్ము రారమ్మని పిలిచాయంట

అది గాంచి ....పులకించి ....బంధించే ...నా ముదిత సందిట.


నా శ్రమ వృధా పోలేదన్దోయ్ .......మూడవ బహుమతి ఇచ్చారు.......ముచ్చటగా !


( ' అదే ....మా కొంప ముంచింది '....అనుకుంటున్నారు కదూ ) !
Wednesday, May 5, 2010

నిమ్మతొన

నిమ్మతొన అంటే అచ్చం గా నిమ్మ తొన కాదండి .....మరి నిమ్మ తొన లాంటిదే నండి . అదేనండీ ........మీ కాలం లో అంటే ఖరీదైన ప్యాకింగు లలో రకరకాల తిను బండారాలు దొరుకుతున్నాయి కానీ .......మా కాలం లో ఐతే .......బస్సుల్లో కొనుక్కు తినాలంటే .....వాంతులు కాకుండా వుండ డానికి కూడా ......' నిమ్మ తొనలు ' లా వుండే ( కనపడే ) ఆరెంజు చాక్లెట్లు అమ్మే వారు . అవి పుల్ల పుల్ల గా .....తీయ తీయ గా ....కలగలుపు రుచి తో గమ్మత్తు గా ఉండేవి ! అల్లా బస్సులో ఓ కుర్రాడు ' నిమ్మ తొనలు ' - 'నిమ్మ తొనలు ' అని అమ్ముతుంటే...... నేనూకొని వాటి రుచిని ఆస్వాదించాను. రెండు వరసలు వెనగ్గా కూర్చున్న ఓ జంట మాత్రం బస్సు ఎక్కిన దగ్గర నుంచీ చిలిపి కయ్యాలు పెట్టు కుంటూనే వున్నారు. బస్సు ఆగిన ప్పుడు ఆమె మాటలు గాలిలో తేలి లీలగా వినపడ్డాయి ''పెళ్లి ఐన తర్వాత మీరు బొత్తిగా ప్రేమ చూపించడం లేదు......ఎంతైనా మీరు మారిపోయారు '' అని ! పాపం అతను సర్ది చెప్పలేక తెగ ఇబ్బంది పడి పోతున్నాడు ! అతని ఇబ్బంది అవస్థ లోనుంచి పుట్టిన చిలిపి ఊహే .......ఈ ' హైకూ ' లాంటి......' దోహా ' లాంటి తవిక ......అదేనండీ ' కవిత '!( సారీ ......ఇది ' తవికే ' )

ప్రేమ నిమ్మతొన ............పెళ్ళి తుమ్మ మొన !

తీయ తీయ గా ...పుల్ల పుల్ల గా వున్నది కాస్తా.................ముల్లులై గుచ్చుకుంటుంటే .........ఆ మాత్రం నిట్టూర్పు వేదన ఎవరికి మాత్రం కలుగదు చెప్పండి !

Sunday, May 2, 2010

మనకూ వుంది .....ఓ వేలాడే వంతెన !

వేలాడే వంతెన -లక్నవరం చెరువు !

            అవును మనకు వుంది ఓ వేలాడే వంతెన . హౌరా అంత పెద్దది కాకపోవచ్చు. కానీ దాని కంటే అందమైనది, సుందరమైనదీనూ ! వరంగల్లు నుండి ఓ ఏడు పదుల కిలోమీటర్ల దూరంలో ...అడవిలో. .ఓ అందమైన పెద్ద చెరువు వుంది . దాని పేరు ' లక్న వరం ' కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్నఆ చెరువు మధ్య ఓ చిన్ని దీవి వుంది . ఆ దీవినీ ఒడ్డును కలుపుతూ ' ఓ వేలాడే వంతెన ' వుంది . ఉదయం కానీ , సాయంత్రం కానీ ....ఆ వంతెన, ఆ దీవి,ఆ సరసు అందాలు ......నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుందేమో !


రామప్ప గుడి,పాకాల చెరువు,మేడారం ''సమ్మక్క- సారక్కను'' చూడాలనుకునేవాళ్ళు వాటన్నింటి కంటే ముందే వచ్చే ఈ చెరువును- వేలాడే వంతెనను వెళ్ళే టప్పుడో ....వచ్చేటప్పుడో చూసేలా ' మీ దర్శనీయ ప్రదేశాల - చిట్టాలో' ఉండేలా చూసుకోవడం మంచిది. కాక పొతే మరీ ఎండాకాలం లో ఐతే నీళ్ళు అడుగంటి పోయి ఆ రమణీయతను కోల్పోయే ప్రమాదం వుంది !

వచ్చే వర్షాకాలం .......వస్తారు కదూ ! దయచేసి ప్లాస్టిక్ బాగులతో ....ఎంగిలి ప్లాస్టిక్ విస్తరాకులతో దానిని పాడు చేయకండే !

రూటు : ములుగు నుంచి పస్ర వెళ్ళే దారిలో కుడి వైపున(పాకాల చెరువు కంటే ముందే వస్తుంది ) !