స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Tuesday, June 1, 2010

మా వూరి అందాలు - గోదారి బంధాలు - 2

మా గుడితో అనుబంధాలు - డా.కె. వి. రమణమూర్తి.   


                  'మావూరి అందాలు - గోదారి బంధాలు 2'  అని పేరు పెట్టినందుకు  క్షమించండి. పార్టు -2  అని సాగదీసి రాసేంత గొప్ప 'పోస్టు' ఏమీ కాదు ఇది . నా ఉద్దేశం ఏమిటంటే........ అది చదివిన తర్వాతే దీన్ని చదవండి అని చెప్పడం అన్నమాట . ఎందుకంటే - మావూరి పేరు శ్రీనివాసపురం ఎలా మారిందో మీకు చెపుతానని మీకు ఇంతకు ముందు 'వాగ్దానం' చేసాను కాబట్టి. ఇలా పేరు పెట్టాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పడం అన్నమాట . 

                   అదుగో - పైన కనబడుతున్నాడే ఆయనే మా 'సంకట హర వెంకటేశ్వర స్వామి'..... అదేనండీ 'శ్రీనివాసుడు'. గర్భగుడి లోని స్వామిని  డైరెక్టుగా కెమెరాలో బంధించకూడదు కాబట్టి ఓ పలుచటి తెరవేసి  మరీ బంధించాము. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మా స్వామి నిలువెత్తు  విగ్రహం చిద్విలాసం చిందిస్తూ బహు సుందరంగా వుంటుంది . ఆ సుందరాంగుడుకి - మొన్నే (16 - 05 - 10 ) పెళ్లి అయ్యిందేమో - సకల అభిషేకాలతో మరింత వన్నె తేలి సమ్మోహనంగా తయారు అయ్యాడు.

                  'అదేమిటీ.....మొన్ననే పెళ్లి అవడం ఏమిటి ? చిత్రం కాక పొతేనూ'  - అని హాస్చ్యర్యపోకండి !'  అంత ఎండల్లో పెళ్లి చేసుకునే ఉబలాటం ఏమిటీ  '.......అని విస్తు పోకండి.  ' మీ దేవుడైనంత  మాత్రాన మీ ఇష్టమేనా? ' అని విసుక్కోకండి.  నాకూ మీలాగే డౌటు వచ్చి అడిగా అయ్యగారిని. '' అయ్యా ! ఇంత ఎండల్లో అయన ఇబ్బంది పడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఆ ఇబ్బందిని ఇబ్బందీ.... అని చెప్పుకోలేనంత ఇబ్బంది ఎందుకొచ్చిందీ ?''. అని అడిగా  కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూనే ! ఆయనగారు మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇలా సమాధాన మిచ్చారు ....'' బాబూ !  ప్రతి సంవత్సరం ' హోళీ ' రోజున స్వామివారి కళ్యాణమవుతుంది . కానీ ఈ ఆలయ విషయంలో ఆ నియమం చెల్లదు . ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన ప్రకారం 'మే' మాసంలోనే కల్యాణం జరగాలి .కాబట్టి ఎండైనా, కొండైనా.- ఆరైనా, నూరు అయినా - నూరు ఆరైనా ఈ కాలం లోనే చేయాలి ''......అని నొక్కి వక్కాణించే సరికి బుద్దిగా తల ఊపి ....స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లలో తలమునకలై, ఆ కళ్యాణమేదో  జరిపించేసాం.- ప్రతి ఏటా జరిపిస్తున్నాం! పండగలకు - పబ్బాలకు కలుసుకోక పోయినా..... తప్పనిసరిగా కల్యాణానికి అందరం కలవాలని నిశ్చయించుకుని ....అలాగే కలుస్తున్నాం!

                               అదేమిటండీ ............? మీరేమైనా 'టైటిలు' తప్పు పెట్టారా ? 'బైరాగుల పాడు' నుంచి మీ వూరి పేరు ''శ్రీనివాసపురం'' గా ఎలా మారిందో చెప్తానని ....అది చెప్పకుండా చదువుతున్నాము కదా , అని మీ దేవుడి పెళ్లి గురించి  చెపుతున్నారు'..అంటున్నారు కదూ! తొందరపడకండి సార్ /సారినులూ ( అదేనండీ 'మేడం' లూ)! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా!
            

      
 పది సంవత్సరాల క్రితం వరకూ మావూరి పేరు ' బైరాగుల పాడే' !

                                                కురసం. కన్నయ్య  మరియు శ్రీ లక్ష్మి దంపతులు.
                                                                                                                                                                                                                                                                                                               మరి ఎందుకొచ్చిందో తెలియదు కానీ మా మాతా - పితరులకు  మా స్వస్థలంలో 'శ్రీనివాసుని' ఆలయం కట్టాలని తలంపు వచ్చింది . వచ్చిందే ఆలస్యం 'ఆర్ధిక .....హార్దిక పరిపుష్టి' లేని ఆ వూర్లో స్థల దానంతో పాటు ..........ఆర్ధిక దానం తో పాటు..... చందాల కోసం ఊరూరా తిరిగి ......ఆలయ నిర్మాణం చేపట్టి దాన్ని 2000 సం // లో పూర్తి చేసారు . అప్పటి నుంచీ ప్రతి ఏట ' మే ' మాసంలో స్వామి వారి కల్యాణం జరిపిస్తున్నారు. అంచలంచలుగా  నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటికి ఓ రూపు వచ్చింది  .....ఆ ఆలయానికి. మేము కూడా మా శాయశక్తులా.. ఇతోధికంగా కృషి చేసి  ఆలయం ఈ స్థాయికి  వచ్చేలా చేసాం.  చిరస్థాయిగా ఆ వూరి పేరు సార్ధకం కావాలని ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు అందరి పై ప్రసరించాలని ఆశించి ఆ వూరి పేరును '' శ్రీనివాస పురం''గా మార్చి గెజిటులో కూడా మారేలా కృషి చేస్తున్నారు ఆ వూరి గ్రామస్తులు.




  మరిన్నికళ్యాణపు  ఫోటోలు  చూసి తరించండి !  ఉత్సవ విగ్రహాలు వీక్షించండి !

                                                                                                                                                                                          



ఇవండీ    మా వూరి విశేషాలు. మా చిన్ని గుడి ప్రత్యేకతలు. ఎప్పుడైనా పర్ణశాలకు వెళ్తే మాత్రం మా బీద ' ఏజెన్సీ - దేవుడు' ని ఆగి  చూడండే!

               గంగోలు గురించి రాయాలంటే ....ఫోటోలు కొన్ని సేకరించాలి ! అవి పూర్తైన తర్వాత పసందైన విశేషాలతో, కనువిందైన బొమ్మలతో. మీ ముందుంటా ....అంత వరకూ టాటా!


3 comments:

  1. మీ ఊరి గుడి ఏమో కానీ, ఆది చదివేసరికి నాకు పెళ్లి వయసు దాటేటట్టు ఉంది.
    జిల్లా పత్రికకు పంపండి, ప్రచురణ కి వాడికి మంచి కథనం దొరికినట్టే.

    ReplyDelete
  2. అద్భుతం గురువుగారు. మీ ఊరుపై మీకున్న అభిమానం చుస్తుంటె ముచ్చటేస్తుంది. అంతకంటే మీ రచనా శైలి ఎంతటి వారినైనా ఆకట్టుకునేలా ఉంది. ఇట్టే కట్టి పడేస్తుంది. మీ ఊరు నిజంగా అంత అ౦ద౦గా ఉ౦దో లేదో తెలియదుగాని మీ ఈ వర్ణనతో లేని కొత్త అందాలను సంతరించుకొ౦టు౦ది.
    T.Srinivas,NTPC-Ramagundam

    ReplyDelete
  3. ధన్యవాదములు శ్రీనివాస్ గారూ !

    మా వూరు అంత అందం గా వుండదు . కానీ ....గోదారి వొడ్డు ....పడవ ప్రయాణం ....లంక లో విహారం ....అశ్వాపురం వైపు
    earth-dam మాత్రం ఖచ్హితం గా బాగుంటాయ్ !

    ReplyDelete