స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Tuesday, May 25, 2010

మా వూరి అందాలు .......గోదారి బంధాలు !

గోదారి గట్టుందీ ........ అని  పాడుకునే అవకాశం ఆ వూరికి వుందీ  అంటే - ఖచ్చితం గా ఆ వూరికి విశిష్టత వున్నట్లే  లెఖ్ఖ ! ఆ గోదారి రెండు ఒడ్లను కలుపుతూ .....మధ్య లో ఓ లంకను కలుపుతూ ఓ ' డాము ' కూడా వుందంటే  మరింత విశిష్టత ఉన్నట్టే ! అలాంటి  వూర్లలో మా వూరు ఒకటి . పట్టణాల పేర్లు ఎలాగూ ' ఫేమస్ ' అవుతాయి. ఇలా అయినా మన వూర్లు ' ఫేమస్ ' కావాలనే స్వార్ధం తో ... ఈ పోస్టు రాస్తున్నా ( అలాగని మిమ్మల్ని ఎక్కువగా విసిగించను లెండి).


'భద్రాచలం' గురించి తెలియని వారు వుండరనుకుంటాను. దక్షిణాది పుణ్య  క్షేత్రాలలో......పేరెన్నిక కన్నది, సీతారాములను మన కళ్ళ ముందు నిలిపేదీ........' భద్రాచలం ' మాత్రమే ! అలాంటి భద్రాద్రి కి - పర్ణశాల కు మధ్యలో, భద్రాద్రి నుంచి 25  కి. మీ. దూరంలో పైకి వున్న ఊరే మా వూరు పేరు '' సున్నం బట్టి- బైరాగుల పాడు ''!

పేరు వింత గానూ కొత్తగానూ వుంది కదూ ! సరే......' దుమ్మగూడెం ' పేరు వినే వుంటారనుకుంటా . ఈ మధ్య ' ఎత్తి పోతల ' పధకాలని....' హైడ్రాల్ ప్రాజెక్టు '  అని......బాగానే వార్తలకు ఎక్కుతుంది లెండి . అదుగో ఆ మండలం లో వున్న ఊరన్న మాట . నేను చెప్ప బోయే  ' డాము- లంక ' ఈ రెండు ఊర్లను ఆనుకునే వుంటుంది.
సరే...సరే   దారి తప్పి మావూరి నుండి ఆ వూరు వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదూ ....అదేమీ కాదు లెండి. అసలు మా వూరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ....


                                                             ఇదే హైడ్రాల్ ప్రా జెక్టు 

సున్నం బట్టి :-   సున్నం అనగా మీకు తెలుసు (lime ) మరి బట్టి అంటే తెలుసుగా కొలిమి' లాంటి ఓ పెద్ద పొయ్యి అన్నమాట. సున్నం తయారు చేసే  ప్రక్రియ కు దోహదపడే ఒక సాధనం అనుకుందాం.  'అసలు సున్నం తయారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది '.....అని మీకు సంశయం కలగవచ్చు. మీ డౌటు కరెక్టే !
ఎందుకు తయారు చేయవలసి వచ్చిందంటే అప్పట్లో ఏ కట్టడం కట్టాలన్నా ' రాయి' ' సున్నం ' తోనే కట్టేవారు కాబట్టి . అక్కడ సర్ .ఆర్థర్ కాటను మహాశయుడు ఓ వారధి ( డాము ) నిర్మించాడు కాబట్టి !  మధ్యలో  ఓ చిన్న దీవి  వుంది దాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఒడ్డు ను ఈ ఒడ్డును కలుపుతూ రెండు ఎర్తు డాములు కట్టి ' గోదావరి ' ని అందంగా ....సున్నితం గా బంధించాడు కాటను మహాశయుడు !వర్షా కాలం లో నీరు ఆ డాముల మీదుగా పొంగి పొర్లుతూ ' రాజమండ్రి ' వైపుగా పరుగులు పెడతాయి !

హెడ్డు- లాకులు

హెడ్డు లాకులు:  అప్పట్లో బస్సులు ఎక్కువ లేవు గాబట్టి.. రవాణా సౌకర్యం నీటి పైనే వుండేది . అదీగాక అప్పట్లో ' రాజమండ్రి -పేపరు మిల్లు 'కు కావాల్సిన కలప ' వెదురు తెప్పలు' గా ( పాత 'గోరింటాకు '...సినీమాలో లా ) గోదావరి మీదుగానే ప్రయాణించ వలసివచ్చేది ! అందుకే ఓ ఆరు కిలోమీటర్లు కాలువ ఒకటి తీసి  దానికి డాము పక్కన ఇవతలిగా ' మూడు అంచెల లో ' దాటే విధంగా ' లాకులు ' అమర్చారు. లాంచి  గానీ.....తెప్ప గానీ దాటాలంటే కనీసం మూడు గంటలైనా పట్టేది . అది చూడవలిసిందే కాని వర్ణించనలవి  కానిది . అంటే పై ఎత్తులో వున్న తెప్ప .....మూడు అంచెలుగా క్రిందకు దిగి ....కాలువ లో కలిసి ఆరు కి. మీ. ప్రయాణించి గానీ టైలు  లాకులు చేరుకోవు. 

                          అవతల వొడ్డున కనపడుతున్నది' భారజల అణు విద్యుత్ కేంద్రం ', అశ్వాపురం

టైలు లాకులు : అవునండీ - తోక భాగంలో వుంటాయి కాబట్టి టైలు-లాకులు అన్నారు .ఇవి  ' గంగోలు ' అనే వూర్లో వున్నాయి. గోదావరి వొడ్డున... నాలుగంటే నాలుగు  ఇల్లు . చుట్టూ అన్ని రకాల వృక్షాలు.  ఆరు కి.మీ.  దూరం...ఎడబాటు ను  సహించలేని.. ఆ కాలవ పాయ ఆత్రం గా గోదావరి లో కలిసే వైనం.... చోటు...  ఎప్పటి కీ  మరిచి పోలేను.  నా బాల్యం అంతా  అక్కడే గడిచింది. దీన్ని గురించి  రాయాలంటే ఓ పెద్ద గ్రంధమే అవుతుంది. ఫోటో లతో మళ్లీ  వేరే రాస్తా. ఇక్కడ కూడా మూడు అంచెలుగా మళ్లీ  లాంచి గానీ.... తెప్ప   గానీ.. పడవ గానీ లాకులని దాటి అప్పుడు గోదావరిలో కలుస్తాయి .అదండీ సంగతి.


అరె అసలు సంగతి మర్చిపోయాను ....' బైరాగుల పాడు ' గురించి చెప్పనే లేదు కదూ !..

బైరాగులపాడు :  ' బైరాగులు ' అంటే తెలుసు కదండీ ' సన్యాసులు ' ! చెప్పాను కదండీ మా వూరు ' భద్రాద్రి ' కి  పర్ణశాలకు మధ్యన వుంటుంది కాబట్టి . కాలినడకన భద్రాద్రి నుంచి బయలు దేరిన సన్యాసులు అందరూ మా వూరు మొదట్లో  వున్న చింతల తోపులో ఆగి , బిక్ష చేసుకుని, తత్వాలు పాడుకుని, తిరిగి తెల్లవారే బయలుదేరి  వెళ్ళేవారట ! అలా - వాళ్ళకు  మజిలీ గా పనికి వొచ్చింది కాబట్టి  కాల క్రమం లో '' బైరాగుల పాడు'' గా స్థిర పడిపోయింది . ఇప్పుడది ' శ్రీనివాస పురం ' గా మారింది  లెండి . ఆ  కధా - కమామీషు '' మా వూరి గుడి '' లో రాస్తాను లెండి .

15 comments:

  1. మా ఊరు భద్రాచలమేనండీ.. మీ ఊరి పేరు నేనెప్పుడూ వినలేదు. అయినా నాకెక్కువేమీ తెలీదనుకోండి. మీ ఊరి కబుర్లు మాత్రం బాగున్నాయి. మిగతా విశేషాల కోసం ఎదురు చూస్తాను.

    ReplyDelete
  2. @మధురవాణి !
    నమస్కారం !
    దుమ్మగూడెం క్రాసు రోడ్డు దాటిన మూడు కి.మీ. తర్వాత మావూరు వస్తుందండీ !మా వూర్లో ఆర్డినరీ లు తప్ప వేరే బస్సులు ఆగవు.
    మీరు దుమ్మగూడెం చూడాలనుకుంటే యే ఎక్ష్ప్రెస్సు ఎక్కినా ....మైను రోడ్డు నుంచి లోపటికి వెల్లి వస్తాయి బస్సులు. వూరు మొదత్లోనె లాకులు , గోదారి కనబడతాయి మీకు .
    నా బ్లాగు వీక్షించినందుకు ధన్య వాదములు.
    @ కొత్త పాళీ !
    నా బ్లాగు ను వీక్షించినందుకు ధన్యవాదములు. మీ బ్లాగు ను చూస్తా !

    ReplyDelete
  3. mee vooru anta goppanna maata !

    ReplyDelete
  4. సానా బాగా సెప్పారండి. గంగోలు పొటోలు కోసం ఎదురుసూస్తూ ఉంటాను. మొన్ననే మా అమ్మానాన్నా భద్రాసలం దర్శనం సేసారు..పాపికొండలు సూసి రమ్మన్నారు...వస్తా ఎప్పుడో వస్తా...

    ReplyDelete
  5. chala baga vrasaru murthy garu. ee headlakulu,tail lakula sangathenti???

    ReplyDelete
  6. hai uncle...naku alanti places lo undalante chala istam.meeru chepe vakyalalone telustundi mee ooru anta andanga untundoani,chuste inka baga untundi.....kada mem andaram kalisi mee ooriki tour vastam uncle.......

    ReplyDelete
  7. naa chinnathanamlo maa nannagaru kothagudem lo work cheseru. appudu kinnerasani dam, bhdrachalam anni choosemu. paatha gyapakalanu thiragavesaru naaku kooda.thnks for the information. ilage chala oorla perlu kooda teliyakunda undipothunnai. bagundi blog.

    ReplyDelete
  8. superuuu uncle...vari chenu antha pachaga undi mee blog....:)

    ReplyDelete
  9. సాగర్ మిత్రుడు ర్రమణమూర్తికి : బ్లాగులో మీ ఊరి గురించి రాసింది బాగుంది. దుమ్ముగూడెం ప్రాంతం నాకు బాగా తెలుసు. నేను చిన్నప్పుడు వేంకటాపురంలో చదువుకున్నాను. ఆ ప్రాంతం అన్నా అక్కడి జనం అన్నా నాకెంతో అభిమానం. కోస్తా జిల్లాల జనాల్లో సాధారణంగా ఉండే వ్యాపార సంబంధాలు అక్కడి జనంలో కనిపించవు. వెంకటాపురం చిన్ననాటి జ్ఞాపకాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే నీ బ్లాగు వల్ల నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటీ అంటే బైరాగులపాడు దగ్గర్లో గోదావరి మీద ఆనకట్ట ఉందనీ, అక్కడ కూడా కోస్తా జిల్లాల్లో మాదిరిగా కాలువలు లాకులు ఉన్నాయని. ఇంతకాలం ఆ feature కోస్తా కే పరిమితం అనుకున్నాను. కాదని ఇప్పుడే తెలిసింది.

    మిత్రుడు రఘు

    ReplyDelete
  10. ఇంకో మాట..వెంకటాపురంలో చిన్నప్పుడు మా ఇంటి వెనక చింతచెట్టు కింద ఉన్న సున్నంబట్టీ మీద పుల్ల పుల్లటి చింత పళ్ళు తింటూ ఆడుకొంటూ ఉండే తియ్య తియ్యని ఆ రోజులు నాకింకా గుర్తే

    ReplyDelete
  11. Excellent 👌,nenu eppudu chudaledu e sari thappakunda visit cheyali
    Tq for ur information uncle

    ReplyDelete
  12. గంగోలు అంటే childhood summer holidays friends తో గోదారి స్నానాలు
    అమ్మమ్మ shunting

    ReplyDelete